logo

ఆపరేషన్‌ భిక్షాటన్‌

నగరంలోని ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి సొంతూళ్లకు పంపించేందుకు హైదరాబాద్‌ జిల్లా అధికారులు ‘ఆపరేషన్‌ భిక్షాటన్‌’ చేపట్టారు. నగరంలో 19 ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించారు.

Updated : 27 Mar 2024 05:15 IST

కూడళ్లలో యాచిస్తున్న చిన్నారులు సొంత రాష్ట్రాలకు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి సొంతూళ్లకు పంపించేందుకు హైదరాబాద్‌ జిల్లా అధికారులు ‘ఆపరేషన్‌ భిక్షాటన్‌’ చేపట్టారు. నగరంలో 19 ప్రాంతాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించారు. స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు, పోలిస్‌ అధికారులు కొద్దిరోజులుగా ఆ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న పిల్లలను వారితోపాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను తీసుకొచ్చి.. ఒకటి, రెండు రోజులు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించిన అనంతరం వారి సొంతగ్రామాలకు పంపిస్తున్నారు. నెలరోజుల్లో 156మంది పిల్లలు, 67మంది తల్లిదండ్రులు, సంరక్షకులను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వారి సొంతూళ్లకు పంపించారు. భిక్షాటన నిమిత్తం మరోసారి హైదరాబాద్‌కు రావొద్దని చెబుతున్నారు. మళ్లీ వస్తే తల్లిదండ్రులు, సంరక్షకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి పంపుతున్నారు.

పదేళ్లలోపు పిల్లలే ఎక్కువగా..

హైదరాబాద్‌లో భిక్షాటన ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భావనతో బీదర్‌, కలబురిగి, బళ్లారి, రాయచూర్‌, షోలాపూర్‌, తుల్జాపూర్‌, అనంతపురం జిల్లాల నుంచి వందల మంది పిల్లలను వారి తల్లిదండ్రులు, సంరక్షకులు నగరానికి తీసుకొస్తున్నారు. ఇందుకు ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు పిల్లలనే ఎంచుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, ప్యారడైజ్‌ సర్కిల్‌, మాసాబ్‌ట్యాంక్‌, నానల్‌నగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని ఆలయాలు, రద్దీకూడళ్ల వద్ద పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పిల్లలు భిక్షాటన చేస్తుండడాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు వివరించగా పోలీసుల సాయంతో భిక్షాటన చేస్తున్న పిల్లలను, వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని వివరాలను సేకరిస్తున్నారు. పిల్లలను చదివించాలని, ఆ స్తోమత లేకపోతే హాస్టళ్లలో వేయాలి తప్ప భిక్షగాళ్లుగా వారిని తయారు చేయవద్దని సూచిస్తున్నారు. షోలాపూర్‌లో ఉంటున్న 19 మంది పిల్లలను అక్కడికి పంపించేందుకు మంగళవారం స్వయంగా జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ బాలల సంరక్షణ కేంద్రానికి వచ్చారు. పిల్లలను చదివిస్తే తనలా కలెక్టర్‌ అవ్వొచ్చని తల్లిదండ్రులు, సంరక్షకులకు చెప్పారు. వారి సొంతూళ్లలో పిల్లలను చదివించేందుకు ఇబ్బందులుంటే తనకు ఫోన్‌ చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని