logo

Hyderabad: భయపెడుతున్న భువన్‌.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్‌ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్‌ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను  జారీ చేస్తున్నారు.

Updated : 29 Mar 2024 07:07 IST

ఈనాడు, హైదరాబాద్‌, నార్సింగి, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు భయపెడుతున్నాయి. భువన్‌ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్‌ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను  జారీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంత మేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా  బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట్‌, నిజాంపేట, బోడుప్పల్‌, ఫిర్జాదీగూడ, జవహర్‌ నగర్‌లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో పన్నులు కట్టకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంటిపన్ను వసూళ్లు ముప్పైశాతానికి మించడం లేదు.

రూ.5వేలు కాదు.. రూ.20వేలు...

శివారులో 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీల్లో సగటున నాలుగురెట్లు పన్నులు పెంచారు. ఉదాహరణకు బండ్లగూడలోని ఒక ఇంటి యజమాని 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్ను రూ.5వేలు చెల్లిస్తే ప్రస్తుతం రూ.20వేలు  చెల్లించాలి. తాము సొంతంగా పన్నుల విధింపు చేపట్టలేదని, రాష్ట్ర వ్యాప్తంగా  ఇంటి పన్నుల విధింపు కోసం ‘భువన్‌’ సర్వే ఆధారంగా ఎంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించారు? ఖాళీస్థలం ఎంతఉంది? అన్న వివరాలను ఉపగ్రహంతో తీసిన చిత్రాల ఆధారంగా పన్నును నిర్ధారించామని మున్సిపల్‌ అధికారులు తెలిపారు.  

కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లో తగ్గుతున్న వసూళ్లు..

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంటిపన్నులు అశాస్త్రీయంగా విధిస్తున్నారంటూ యజమానులు కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి మున్సిపాలిటీల్లో 25- 50శాతం వరకే పన్నులు వసూలయ్యాయి. మరికొన్ని చోట్ల 2ఏళ్ల క్రితం పన్నులు చెల్లిస్తే.. భువన్‌ సర్వే ప్రకారం సవరించి ఇంటి యజమానులు చెల్లించిన పన్నులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించి కొత్త పన్నుల్లో కలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని