logo

అదనంగా 60శాతం ఈవీఎంలు

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు.

Published : 05 May 2024 04:08 IST

ఎక్కువ మంది బరిలో ఉండటంతో పెరిగిన అవసరం

సమావేశంలో మాట్లాడుతున్న రోనాల్డ్‌ రాస్‌, ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు. ప్రారంభంలో ఒక్కో పార్లమెంటు స్థానంలో పోలింగ్‌ కేంద్రానికి(పీఎస్‌) ఒకటి చొప్పున ఈవీఎంలు సరఫరా అయ్యాయి. అనూహ్యంగా.. నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక.. చాలా మంది బరిలో మిగిలారు. హైదరాబాద్‌ ఎంపీ పరిధిలో 30 మంది, సికింద్రాబాద్‌లో 45 మంది పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఈవీఎంలు అదనంగా అవసరమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఎంపీ పరిధిలో రెండు బ్యాలెట్‌ యూనిట్లు, సికింద్రాబాద్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు మూడేసి బ్యాలెట్‌ యూనిట్లను సమకూర్చాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.  

మొదట ఒక్కొక్కటి చొప్పున.. రెండు ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంతో కలిపితే హైదరాబాద్‌ జిల్లాలో 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి సంఖ్యకు 25శాతాన్ని అదనపు ఈవీఎంలు కలిపి తొలుత మొత్తం 5వేలు జీహెచ్‌ఎంసీకి వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక 12వేల ఈవీఎంలు అవసరమని తేలింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్‌రాస్‌ సమాచారం ఇవ్వడంతో..దాదాపు 8వేల బ్యాలెట్‌ యూనిట్లు నగరానికి చేరుకున్నాయి. వాటికి ర్యాండమైజేషన్‌ శనివారం పూర్తిచేసినట్లు రాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని