సవాల్‌ స్వీకరించి.. స్పందనగా ఆచరించి

ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్‌మాబ్‌...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్‌ ఛాలెంజ్‌’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి.

Updated : 18 May 2024 03:54 IST

సత్ఫలితాలిచ్చిన ‘ఓట్‌ ఛాలెంజ్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్‌మాబ్‌...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్‌ ఛాలెంజ్‌’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. గతంతో పోల్చితే రాజధానిలో ఓటింగ్‌ శాతం పెరిగింది. హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోనే 3.64శాతం వృద్ధి నమోదైంది. చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాల్లోనూ పోలింగ్‌ శాతం పెరగడంతో మున్ముందు మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భావిస్తున్నాయి.

ఓటేయండి.. ఛాలెంజ్‌ విసరండి

ఓటింగ్‌శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు సరికొత్త ఆలోచన చేశాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్‌ విసరండి’ అంటూ కొత్త నినాదం మంచి ఫలితం ఇచ్చింది. కాలనీ సంక్షేమ సంఘాల వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ నినాదాన్ని విస్తృతం చేయడంతో  ఈ కొత్త ఛాలెంజ్‌ ఎక్కువ మందికి చేరువైంది.  

షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే...

యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ కొన్నేళ్లుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు బదులు యువత మెచ్చే స్టాండప్‌ కామెడీ, రాక్‌బ్యాండ్‌ల ద్వారా ఓటు విలువ చెప్పే ప్రయత్నం చేయడంతో యువత పోలింగ్‌ కేంద్రాలకు కదిలారు. ‘షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే’ నినాదానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. యువతకు చేరువయ్యేలా చేపట్టిన ‘తెలంగాణ లెట్స్‌ ఓట్‌’, ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ పేరిట సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని