logo

చేవెళ్లకు అంతర్జాతీయ గుర్తింపు

‘‘చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటై పదిహేనేళ్లయింది. అప్పట్లో శంషాబాద్‌ విమానాశ్రయం మాత్రమే ప్రారంభమైంది.

Updated : 06 May 2024 05:37 IST

కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

‘‘చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటై పదిహేనేళ్లయింది. అప్పట్లో శంషాబాద్‌ విమానాశ్రయం మాత్రమే ప్రారంభమైంది. నేను ఎంపీ అయ్యాక అభివృద్ధిని పరుగులు పెట్టించా. ఐటీ, ఫార్మా, పరిశ్రమల ఏర్పాటుతో చేవెళ్ల లోక్‌సభ స్థానానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఐదేళ్లలో రూ.వందల కోట్లతో పనులు చేపట్టాం. పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వృద్ధితోపాటు రైతులకు చేయూత ఇస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాం.’’ అని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఎన్నికల్లో గెలిస్తే మీ తొలి ప్రాధాన్యాలేంటి.. వాటిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?

ఎంపీగా గెలిస్తే నా తొలి ప్రాధాన్యం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలందరికీ విద్య, వైద్యం అందించడం, మెట్రోరైల్‌ విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టడతాను. ఈ రెండింటినీ ఆరునెలల్లోపు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వీటితో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాను.

మీరు గెలిచేందుకు ప్రధాన అంశాలేంటి.. అవి మీకు ఎలా దోహదపడతాయి?

ఐదేళ్లలో ప్రజలతో కలిసి వారి ఇబ్బందులు చాలావరకు పరిష్కరించాం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. కొవిడ్‌ సమయంలో బాధితులకు వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా సాయం అందించాం. ఆరోగ్యరథం పేరుతో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉచిత వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాం. ఇవన్నీ విజయానికి దోహదం చేస్తాయి.

ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి.. మీకు ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి సహకారం ఎలా ఉంది?

ఈ ఎన్నికల్లో స్థానిక, జాతీయ అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ నగర ప్రభావం ఉంటుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండడం, అక్కడ పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, ఐటీ సంస్థల్లో పని చేసేవారు ఉండటంతో మతతత్వం, లౌకికవాదం, నిరుద్యోగం వంటి అంశాలు ప్రభావం చూపిస్తాయి.   వికారాబాద్‌, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు బాగా సహకరిస్తున్నారు. నా విజయం కోసం కృషి చేస్తున్నారు.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?

భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఆయన పలు సందర్భాల్లో నాకు ఎవరూ ప్రత్యర్థులు లేరని, రంజిత్‌రెడ్డి పోటీయే కాదని, 3 లక్షల మెజారిటీతో గెలుస్తామంటున్నారు. నేను మాత్రం ఆయనను ప్రధాన ప్రత్యర్థిగానే భావిస్తున్నా.

మీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమస్యలున్నాయి. మీ స్థాయిలో నిధులు తీసుకొస్తారా?

చేవెళ్ల పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సమస్యలున్నాయి. ఐదేళ్లలో నా పరిధి మేరకు వాటిని పరిష్కరించా. వికారాబాద్‌ నియోజకవర్గంలో వందేళ్లనాటి పురాతన వంతెన ఉంది. రూ.100 కోట్లతో వంతెనతోపాటు రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాం. వికారాబాద్‌ను పర్యాటక కారిడార్‌గా రూపొందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం.

  • ఇక్కడ కాస్మోపాలిటన్‌ సంస్కృతి, రైతులు, మధ్యతరగతి ప్రజలు, పరిశ్రమలున్నాయి. ఎంపీగా రూ.కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలయ్యే ‘పాంచ్‌ న్యాయ్‌’ వాగ్దానాలు విజయాన్నిస్తాయి.
  • విశ్వేశ్వర్‌రెడ్డి చేసే వ్యక్తిగత ఆరోపణలకు సమధానమిస్తాం.
  • చేవెళ్ల, శంకర్‌పల్లి, వికారాబాద్‌, తాండూరు జల్‌పల్లి, మున్సిపాలిటీలకు అభివృద్ధి పనులకు నిధులు తెప్పించాం. రాజేంద్రనగర్‌ బల్దియాలో ఉన్నా అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. గతేడాదే మంజూరు చేయించాం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని