logo

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్‌ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

Updated : 07 May 2024 05:51 IST

శంషాబాద్‌: ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్‌ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. డీసీసీ కె.నారాయణరెడ్డి సోమవారం శంషాబాద్‌ జోన్‌  కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నాదర్‌గుల్‌కు చెందిన తాండ్ర రవీంద్ర(45), గీత దంపతులకు పదహారేళ్ల లోపు ఇద్దరు సంతానం ఉన్నారు.రవీంద్ర సెంట్రింగ్‌ మేస్త్రీగా గీత సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కడారి యాదగిరి డీసీఎం డ్రైవర్‌.  గొలుసుకట్టు సంస్థలో సభ్యత్వం తీసుకునే క్రమంలో గీతతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానం వచ్చిన రవీంద్ర గీతను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను హత్య చేయాలని పథకం వేసింది. గత నెల 29న భార్య  పని చేస్తున్న విశాల్‌మార్ట్‌ వద్దకు ఆమెను తీసుకెళ్లడానికి రవీంద్ర వచ్చాడు. ఈ సమాచారాన్ని గీత  యాదగిరికి తెలపగా పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన మరో డ్రైవర్‌ అనిల్‌కుమార్‌ను తీసుకుని వచ్చాడు. భార్య కోసం వేచిఉన్న రవీంద్రను బలవంతంగా కారులో ఎక్కించుకుని  కడ్తాల్‌వైపు బయల్దేరారు.

కారులోనే ఇనుప రాడ్లతో..  మార్గ మధ్యలో రవీంద్రపై ఇనుప రాడ్లతో యాదగిరి, అనిల్‌  దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు. చనిపోయాడనుకుని మక్తమాదారం సమీపంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. మంటలకు తాళలేక హాహాకారాలు చేస్తూ రవీంద్ర 200 వందల మీటర్ల దూరం పరుగెత్తి  తనువు చాలించాడు. మర్నాడు  పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుగా నమోదు చేశారు. భర్త బంధువుల ఒత్తిడి తో రవీంద్ర   అదృశ్యమ య్యాడంటూ భార్య గీత  పోలీసులకు ఫిర్యాదు చేసింది. 30న  ఆమె ఫిర్యాదుతో మీర్‌పేట్‌ ఠాణాలో అదృశ్యం కేసు నమోదు చేశారు. కడ్తాల్‌ ఠాణా పరిధిలో హత్యకు గురైన వ్యక్తి ఆనవాళ్లను రవీంద్ర బంధువులకు చూపించడంతో మృతుడు అతడేనని నిర్ధారించారు. గీత సెల్‌ఫోన్‌ కాల్‌లిస్ట్‌, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో యాదగిరితో హత్య చేయించానని అంగీకరించింది. దీంతో గీత, యాదగిరి, అనిల్‌లను రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని