logo

ఆ వైభవం చూడాలని.. భుజానికెత్తుకొని

మహానగరం పరిధిలోని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బస్సు యాత్రలో ఉంటే మరో నేత హరీశ్‌రావు మెదక్‌ లోక్‌సభ మీద దృష్టి పెట్టారు.

Published : 08 May 2024 04:07 IST

భారాస విజయానికి అన్నీ తానై పర్యవేక్షిస్తున్న కేటీఆర్‌
మొన్నటి ఎన్నికల నాటి జోష్‌ తగ్గకుండా నేతల్లో భరోసా
కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలతో రాత్రిపగలూ  ప్రచారం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

మహానగరం పరిధిలోని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బస్సు యాత్రలో ఉంటే మరో నేత హరీశ్‌రావు మెదక్‌ లోక్‌సభ మీద దృష్టి పెట్టారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌ రాజధానిలో అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకొని.. రాత్రిపగలూ వారి విజయానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కార్నర్‌ సమావేశాలు మరోవైపు కాలనీల్లో పర్యటిస్తూ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి వెళ్లి భారాసకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాజధానిలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న గులాబీ పార్టీలో తాజాగా జోష్‌ తగ్గడంతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేటీఆర్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీని వీడకుండా.. ఎమ్మెల్యేలకు అండ..

రాష్ట్రంలో మిగిలిన జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. రాజధానిలో మాత్రం భారాస అన్ని ఎన్నికల్లోనూ విజయాలు సాధిస్తూనే ఉంది. మొన్నటి శాసనభ ఎన్నికల్లోనూ ఏకంగా 17 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పటి ఎన్నికల్లో ఒకవైపు కేసీఆర్‌ మరోవైపు కేటీఆర్‌ పార్టీ మొత్తాన్ని సమన్వయం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ జిల్లాల్లో బస్సు  యాత్ర మొదలుపెట్టారు. ఈనెల 11వరకు ఆయన జిల్లాల్లోనే పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో గ్రేటర్‌ పరిధిలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతను కేటీఆర్‌కే అప్పగించారు. నెలరోజులుగా ఆయన  అన్ని నియోజకవర్గాల్లోనూ 20కుపైగా కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మరింత దూకుడు పెంచుతూ లోక్‌సభ అభ్యర్థులతో కలిసి కాలనీల్లో ఇంటింటికి వెళుతున్నారు. ఎక్కడికక్కడ అధికార కాంగ్రెస్‌, భాజపాల విధానాలను ఎండగడుతున్నారు. పార్టీ ఫిరాయింపుదారులను ఓడించాలంటూ నగర ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మొన్నటి వరకు కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండటంతో భారాస ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. వీరందరితో కేటీఆర్‌ మాట్లాడారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైతే ఆయనతో మాట్లాడి పార్టీ మారకుండా చూశారు. ఇప్పుడు భారాస ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఎట్టిపరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ నాలుగు రోజులూ భారీగా ప్రచారం నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని