logo

భవనం పై కప్పు కూలి కార్మికుడి దుర్మరణం

నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై అంతస్తు శ్లాబ్‌ (పై కప్పు) కూలి కార్మికుడి మీద పడటంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరులో బుధవారం జరిగింది.

Published : 09 May 2024 01:56 IST

వెంకటయ్య (పాత చిత్రం)
తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై అంతస్తు శ్లాబ్‌ (పై కప్పు) కూలి కార్మికుడి మీద పడటంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరులో బుధవారం జరిగింది. పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌, కుటుంబీకులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పట్టణ పరిధి హసన్‌నగర్‌ కాలనీలో ఓ వ్యాపారి ఏడాదిగా నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. బొంరాస్‌పేట్‌ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన మోత్కూర్‌ వెంకటయ్య (42) ఇక్కడ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కొడుకు (పదో తరగతి చదువుతున్నాడు), కూతురు (ఇటీవలే పెళ్లి చేశారు) ఉన్నారు. బుధవారం ఉదయం భవనం కింది భాగంలో వెంకటయ్య పనిచేస్తుండగా ఇంతలోనే పై అంతస్తు శ్లాబ్‌ కూలి ఒక్కసారిగా అతనిపై పడి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ పక్కనే ఉన్న ఓ వాహనంపై కూడా శ్లాబ్‌ కొంత భాగం పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని, ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.
కూలి మృతికి కారణమైన భవనానికి నిర్మాణ అనుమతులు లేవని ఇది వరకే సదరు యజమానికి తాఖీదులు జారీ చేసినట్లు పురపాలక సంఘం కమిషనరు విక్రమ సింహారెడ్డి తెలిపారు.  

పరిహారం చెల్లించాలని డిమాండ్‌

మృతుడు వెంకటయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, అతని భార్య లక్ష్మి, కొడుకు గణేష్‌, కుటుంబ సభ్యులు, మృతదేహం వద్ద రోదిస్తూ ఆందోళనకు దిగారు. యజమాని నుంచి పరిహారం చెల్లించే వరకు మృత దేహాన్ని తీసేది లేదంటూ అర్ధ రాత్రి దాకా అక్కడే ఆందోళన చేశారు. ఎట్టకేలకు  పోలీసులు వారిని సముదాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని