logo

బిల్లులు అంధక అప్పులు!

ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ పంచాయతీరాజ్‌శాఖ కింద జిల్లాలో రూ.వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. గుత్తేదారులు, సరఫరాదారులు, ఇతరత్రా బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారు కొద్దిరోజులుగా ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొన్ని పనులకు

Published : 20 May 2022 03:36 IST

నిధుల కొరతతో జరగని చెల్లింపులు 
అద్దె భవనాలకు అందని బాడుగులు
పూర్తికాని సచివాలయాలు, ఆర్‌బీకేలు 


ఖాజీపేట మండలం అప్పన్నపల్లెలో అసంపూర్తిగా రైతు భరోసా కేంద్రం

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపు పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం. అన్ని రకాల చెల్లింపులు మే 10వ తేదీ లోపు పూర్తి చేసి గ్రామాల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ధైర్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేయండి. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.- అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి  నివాసంలో మే 1న జరిగిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి హామీ. 

ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ పంచాయతీరాజ్‌శాఖ కింద జిల్లాలో రూ.వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. గుత్తేదారులు, సరఫరాదారులు, ఇతరత్రా బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారు కొద్దిరోజులుగా ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొన్ని పనులకు బిల్లులైనా... చాలా వాటికి రాకుండా పోయాయి. చాలా వరకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలకు సంబంధించినవవే ఉన్నాయి. నరేగా నిధుల అనుసంధానంతో నిర్మాణాలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వివిధ వర్గాలు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఎక్కువ భాగం పంచాయతీరాజ్‌ విభాగంలోనే బిల్లుల బకాయిలున్నాయి. 
- ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్డు/ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో రూ.473 కోట్ల అంచనాతో 1,752 భవనాల నిర్మాణం చేపట్టారు. నెల రోజుల కిందట 748 భవనాల నిర్మాణం పూర్తి చేసి రూ.213 కోట్లు వ్యయం చేశారు. నిధుల వ్యయంలో 45.16 శాతం ప్రగతి సాధించినా అనంతరం బిల్లుల చెల్లింపు చాలావరకు ఆగిపోయాయి. దీంతో పనులు చేపట్టిన గుత్తేదారులు అర్ధంతరంగా నిర్మాణాలు నిలిపేశారు. మంత్రులు హామీ ఇచ్చినట్లుగా బిల్లులు చెల్లింపు అరకొరగానే జరిగింది. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో సచివాలయాలు 320, రైతు భరోసా కేంద్రాలు 421 వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి కోసం దాదాపు రూ.1.50 కోట్లు వరకు అద్దె పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక కార్యక్రమాల కింద పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో చర్యలు తీసుకోవడంలేదు. సచివాలయాల అద్దె గ్రామ పంచాయతీలు చెల్లించాలనే ఆదేశాలున్నా వీటి నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మేజర్‌ పంచాయతీలు సైతం కనీస ఖర్చులకు నిధుల్లేక అల్లాడుతున్నాయి. భవన నిర్మాణాల కోసం దాదాపు రూ.568 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నరేగా నుంచి నిధులు మంజూరు ఆగిపోవడంతో బిల్లులు చెల్లింపులు నిలిచి పోయాయి. దీంతో  గుత్తేదారులు, అద్దెకు ఇచ్చిన భవన యజమానులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. 

గురమ్మ గోడు వినేదెవ్వరు..?
నెలనెలా ఠంచనుగా అద్దె డబ్బులొస్తాయన్న ఆశతో అపురూపంగా నిర్మించుకున్న సొంతింటిని గ్రామ సచివాలయానికి అద్దెకిచ్చారు ఆ దంపతులు. గత 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు జమ్మలమడుగు మండలం గూడెంచెరువుకు చెందిన వృద్ధ దంపతులు గురమ్మ పుల్లారెడ్డి. గురమ్మ పొలం పనులు చేసుకుంటూ, పుల్లారెడ్డి ట్రాక్టరు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రూ.5 వేల అద్దె వస్తుందన్న ఆశతో తమ ఇంటిని అధికారులకు అప్పగించి తాము మాత్రం ఓ చిన్న గదిలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల కిందట పుల్లారెడ్డికి కాలు విరిగిపోవడంతో పోషణ నిమిత్తం ఇంటివద్దే చిల్లర అంగడి పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంగడిలో వచ్చే ఆదాయంతోపాటు సచివాలయానికి బాడుగకు ఇచ్చిన ఇంటి అద్దె కూడా ప్రతి నెలా వస్తే తమ జీవనం సాఫీగా సాగుతుందనేది ఆ వృద్ధ దంపతులు భావించారు. సచివాలయ అద్దె విషయంలో అధికారులు ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటూ.. ఈరోజు, రేపు అంటూ గత  9 నెలలుగా ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదు. తన ఇంటిని ఖాళీ చేయాలని వేడుకున్నా వారి మొరను వినేవారు కరవయ్యారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన గురమ్మ గురువారం తాళం వేశారు. అంతే.. హుటాహుటాన అధికారులందరూ సచివాలయం వద్దకు చేరుకున్నారు. గేటుకు తాళం వేయడానికి నీకేం హక్కు అంటూ గురమ్మను నిలదీశారు. గత 9 నెలలుగా అద్దె చెల్లించకపోగా తిరిగి ఆమెపైనే కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో చేసేదేమీలేక యథావిధిగా గేటు తాళాలు అధికారులకు అప్పగించి ఎప్పుడిస్తారో తెలియని అద్దె కోసం ఎదురుచూస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. 

* గత నెల 27న ఖాజీపేట మండలం అప్పన్నపల్లెలో గ్రామ సచివాలయానికి గుత్తేదారు వాసుదేవరెడ్డి తాళం వేశారు. భవన నిర్మాణానికి పెండింగ్‌ బిల్లులు నెలల తరబడి చెల్లించకపోవడంతో మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు కూడా ఓసారి హెచ్చరించినా స్పందన లేకపోయింది. త్వరలో బిల్లు ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇంత వరకు రాలేదు. 


అధికారులతో మాట్లాడుతున్న అద్దె ఇంటి యజమానురాలు గురమ్మ 

త్వరలోనే చెల్లింపులు 
కేంద్రం నుంచి రూ.1,600 కోట్ల మేర నిధులు త్వరలో రానున్నాయి. ఈ నిధుల రాకతో దాదాపు బిల్లులన్నీ చెల్లింపులు పూర్తవుతాయి. నిర్మాణ పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం. - శ్రీనివాసులురెడ్డి,  ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌ శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని