logo

నకిలీ దందాపై ఉక్కుపాదం

మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Published : 23 May 2024 03:19 IST

జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు
విత్తనాలు, ఎరువుల విక్రయాలపై పరిశీలన
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా విత్తనాల కొనుగోలులో రైతులు మోసపోతున్నారు. దళారులు దిగుబడుల ఆశ చూపి నకిలీ సరకు అంటగడుతుండటంతో నష్టపోతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. అంతర్‌రాష్ట్ర సరిహద్దు నుంచి, రైల్వే మార్గంలో వస్తుండటంతో వాటి నియంత్రణ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. వ్యవసాయ, పోలీసు అధికారులతో పాటు విత్తనోత్పత్తి సంస్థల భాగస్వామ్యంతో కమిటీ నిఘా పెంచింది.

జూలపల్లిలో పురుగు మందుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు (పాతచిత్రం) 

నిషేధిత విత్తనాలు సైతం..

రైతులు ఏటా నకిలీ, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడి రాకపోగా అప్పులే మిగులుతున్నాయి. జిల్లాలో వరి, పత్తి అధికంగా సాగవుతుండగా నకిలీ వరి విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోవడం, దిగుబడి రాకపోవడం పరిపాటిగా మారింది. కలుపు నాశని మందులను తట్టుకునే జన్యు మార్పిడి రకాలైన బీటీ-3 విత్తనాలతో పత్తి సాగులో శ్రమ తక్కువ ఉంటుందంటూ దళారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పత్తిలో గ్లైఫోసెట్‌(గడ్డిమందు) పిచికారీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, క్యాన్సర్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం బీటీ-3 రకం పత్తి విత్తనాలను నిషేధించింది. అయితే పలు చోట్ల వ్యాపారులు వాటిని రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్ధారణ అయితే కేసులు

జిల్లాలో వానాకాలంలో 2,77,743 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. 2,08,814 ఎకరాల్లో వరి, 57,269 ఎకరాల్లో పత్తి, 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు వేయనున్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ, పోలీసు, విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. నకిలీ సరకులపై వీరికి నేరుగా ఫోన్‌ చేసినా, ఫిర్యాదు చేసినా దాడులు చేసి స్వాధీనం చేసుకుంటారు. నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తారు. మండల స్థాయిలో ఏవో, ఎస్సై, సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నారు.

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు

శ్రీనాథ్, ఏడీఏ, పెద్దపల్లి 72888-94148
కిషోర్‌కుమార్, ఏడీఏ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, 72888-79669
మల్లయ్య, ఏఎస్సై, మంథని 94404-61918

అప్రమత్తతే కీలకం

  • విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి.
  • అధికారులు సిఫార్సు చేసిన నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చే రకం విత్తనాలనే ఎంచుకోవాలి.
  • తక్కువ ధరకు అమ్ముతున్నారని నాసిరకం విత్తనాలను కొని నష్టపోవద్దు.
  • లైసెన్సు పొందిన డీలర్లు, దుకాణదారుల వద్దనే కొనుగోలు చేయడం మేలు.
  • దళారుల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలి.

నిరంతర పర్యవేక్షణ

జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులపై క్షేత్ర స్థాయిలో చైతన్యం కల్పిస్తున్నాం. విత్తనాల ఎంపికలో రైతులకు ఏఈవోలు, ఏవోలు మార్గదర్శనం చేస్తున్నారు. సరకు కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. నకిలీలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. మండలాల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తారు.

డి.ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని