logo
Published : 28/11/2021 02:59 IST

12:30 దాటితే వైద్యం బంద్‌

జిల్లా ఆసుపత్రిలో లోపించిన సమయ పాలన

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

ఎముకల విభాగంలో సేవలందిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ప్రభుత్వం ఓవైపు సర్కారు వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతుంటే క్షేత్రస్థాయిలో కొందరి వైద్యుల పనితీరు రోగుల పాలిట శాపంగా మారింది. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిబంధనల మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు సేవలందించాల్సి ఉంటుంది. కానీ జిల్లా ఆసుపత్రిలో ఉదయం 10 దాటితేకానీ కొందరు విధులకు హాజరుకావడంలేదు. వచ్చినా 12.30 దాటితేచాలు ఇంటిబాట పడుతున్నారు. ‘న్యూస్‌టుడే’ శనివారం జిల్లా ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరిశీలన చేయగా పలువురు వైద్యులు ఉదయం 9.30 నుంచి 10.30 మధ్యలో ఆసుపత్రికి వచ్చారు. వచ్చినవారిలో ప్రధాన విభాగాలకు సంబంధించిన అయిదుగురు వైద్యులు 12.30 వరకే రోగులను పరీక్షించి వెళ్లడంతో సిబ్బంది ఒంటిగంటకు ముందే ఆయా గదులకు తాళాలు వేశారు. జనరల్‌ ఫిజిషియన్‌ విభాగాల్లో మాత్రం అసిస్టెంటు ప్రొఫెసర్లు సేవలందించడం కనిపించింది. గత కొన్ని నెలలుగా వైద్యులు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

కొత్తవారిపైనే భారం..

జిల్లా ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న వారిలో నిర్లక్ష్యం అలుముకుంది. ఆసుపత్రిలో 23 మంది శాశ్వత, ఐదుగురు కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్నారు. ఇటీవల జిల్లా ఆసుపత్రికి వివిధ విభాగాలకు సంబంధించి 27 మంది పీజీ శిక్షణ వైద్యులను నియమించారు. ఇటీవల మంజూరైన వైద్య కళాశాలకు సంబంధించి మరో 18 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను సైతం జిల్లా ఆసుపత్రికి కేటాయించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న వివిధ విభాగాల వైద్యులు నామమాత్రంగానే విధులకు హాజరవుతున్నారు. రోగుల్ని సైతం పరీక్షించకుండానే ఇంటిదారి పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీజీ వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే పూర్తిస్థాయి విధుల్లో కనిపిస్తున్నారు. ఆసుపత్రిలో పనిచేసేవారిలో చాలామంది ప్రయివేటుగా వైద్య సేవలందిస్తున్నవారే కావడం గమనార్హం.

తాళం వేసి ఉన్న ఈఎన్‌టీ విభాగం గది

స్కానింగ్‌కు నిరీక్షణే

జిల్లా ఆసుపత్రిలో 12 గంటలు దాటిన తరువాత వచ్చినవారికి కొన్నిసార్లు వైద్యం అందడం లేదు. స్కానింగ్‌ యంత్రం తరచూ మొరాయించడంతో గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షలకు సైతం రోగులు పెరిగినా సేవలు విస్తరించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో వైద్యుల విధి నిర్వహణకు సంబంధించి వివరాలు పట్టికలో నమోదు చేయకపోవడంతో ఓపీ సేవలు, శస్త్రచికిత్సలు, ఇన్‌పేషంట్ల పరిశీలనపై స్పష్టత కొరవడుతోంది.

సేవలకు ఆటంకం లేదు

-డాక్టర్‌ సుదక్షిణదేవి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఆసుపత్రిలో రోగుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగడంలేదు. కొత్తగా వైద్యులు రావడంతో స్థలాభావంతో కొందరు పై అంతస్థులో కూర్చోవాల్సి వస్తోంది. కొత్తగా నియమితులైన వారు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారు. పాతవారిలోనూ చాలామంది విధులకు హాజరవుతున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని