logo
Published : 02/12/2021 03:06 IST

జూదం.. బతుకు ఆగం

జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలు

ఆర్థికంగా నష్టపోతున్న కుటుంబాలు

న్యూస్‌టుడే- కరీంనగర్‌ నేరవార్తలు

‘‘కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారి కష్టపడి ఇంటిని నిర్మించుకుని కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. కరోనా కాలంలో స్నేహితులతో సరదాగా నేర్చుకున్న పేకాట అతన్ని అప్పుల పాలు చేసింది. జూదం ఓ వ్యసనంగా మార్చేసింది. మూడు ముక్కల ఆటలో డబ్బులు గెలవాలనే ఆశతో అప్పులు చేశాడు. కొత్త ఇల్లు విక్రయించినా అప్పులు తీరలేదు. చివరకు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడేశాడు.

జిల్లాలో జూదం జోరుగా సాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక స్థావరాలు దీనికి అడ్డాగా మారుతున్నాయి. కూర్చున్న చోటనే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అనేక మంది ఉన్నదంతా అందులో పెట్టుబడిగా పెట్టి ఇల్లుగుల్ల చేసుకుంటున్నారు. అప్పుల ఊబి నుంచి బయట పడలేక తుదకు తనువు చాలిస్తున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆకస్మిక దాడులతో జూదరులను పట్టుకుని జైలుకు పంపినా ఆట మాత్రం ఆగడం లేదు.

రూ.లక్షలు స్వాధీనం

కరీంనగర్‌లో కొద్ది మంది వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఆర్థికంగా ఉన్న వారికి పేకాట పెద్ద వ్యసనంగా మారింది. నగరంలోని ఖాళీ ఇళ్లు, ప్రహరీ లోపలి స్థలాలు, పెద్ద భవనాలు, అపార్టుమెంట్లలోని పెంటహౌస్‌లు, గ్రామాల్లోని నిర్మానుష్య ప్రాంతాలు, పంట పొలాలు, తోటలను పేకాట స్థావరాలుగా మార్చుకుంటున్నారు. కొంత మంది లాడ్జీల్లోని గదులను అద్దెకు తీసుకుని తమ పని కానిస్తున్నారు. పోలీసులు ఇలాంటి స్థావరాలపై దాడులు చేసిన సందర్భంలో వేల రూపాయలు స్వాధీనం చేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో కమిషనరేట్‌ వ్యాప్తంగా 267 కేసులను నమోదు చేసి 1620 మంది జూదరులను పట్టుకున్నారు. రూ.28 లక్షల 92 వేల నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌ 15 నాటికి 106 కేసులు నమెదు చేసి రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 560 మందిని అరెస్టు చేశారు.

అయినా మారని తీరు..

పేకాట శిబిరాలపై దాడులు జరుగుతున్నా మార్పు రావడం లేదు. ఠాణాలోనే సొంత పూచికత్తు, ఇతరుల జామీనుపై వదిలేయడమే కారణం. పట్టుబడిన వారిపై గేమింగ్‌ యాక్ట్‌ కింద చిన్న కేసులు నమోదు చేస్తున్నారు. మూడు కంటే ఎక్కువసార్లు పట్టుబడితే పీడీ చట్టం అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

కఠిన చర్యలు తీసుకుంటాం : - వి.సత్యనారాయణ, పోలీస్‌ కమిషనర్‌ కరీంనగర్‌

కరీంనగర్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా పేకాట శిబిరాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ఆటలను పూర్తిగా నిషేధించాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ పడి చాలా మంది తమ విలువైన జీవితాన్ని, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. కష్టపడి సంపాదించే డబ్బులోనే అసలైన సంతోషం ఉంటుంది.


మధ్యతరగతిపై ప్రభావం

జిల్లాలోని పేకాటరాయుళ్లు మూడు ముక్కలతో పాటు రమ్మీ ఆడుతున్నారు. కరోనా ప్రతి ఒక్కరిని భయపెడుతుంటే వీరికి మాత్రం మంచి అవకాశంగా మారింది. నిమిషాల వ్యవధిలో జేబులు మొత్తం ఖాళీ చేస్తోంది. పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలతో సంబంధం లేకుండా ఖర్చు పెట్టగలిగే స్థాయిని బట్టి ఆట స్వరూపం మారుతోంది. అనేక మంది కరీంనగర్‌లో కలిసి రాకపోవడంతో కార్లను అద్దెకు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి పేకాట అడుతున్నారు.

పోలీసుల అధ్యయనంలో..

* కరీంనగర్‌ జిల్లా నుంచి 100 మంది వరకు హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు సమాచారం.

* రోజుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తి జూదం కోసం ఖర్చు చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం.

* భార్యలపై ఉన్న బంగారం అమ్మడం, ఇల్లు కుదువపెట్టిన డబ్బులు తెచ్చుకుని జూదంలో పెడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఒక్క ఆటైనా కలిసి వస్తుందనే ఆశతో అందులో నుంచి బయటకు రావడం లేదు.

* పేకాటలో కోల్పోయిన డబ్బులు, చేసిన అప్పులను చెప్పలేక.. కొత్తగా అప్పులు పుట్టక అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.

* పేకాటలో డబ్బులు పోగొట్టుకుని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన వారు ఆలస్యంగా మేల్కొని గుట్టు చప్పుడు గాకుండా సాగుతున్న ఈ ఆట స్థావరాల వివరాలను పోలీసులకు చేరవేస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని