logo
Published : 02/12/2021 03:38 IST

తొలి అడుగు.. భవితకు మలుపు

ఇంజినీరింగ్‌లో మొదటి ఏడాది నుంచే నైపుణ్య సాధన కీలకం

విద్యార్థులకు తరగతులు ప్రారంభం

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే

బీటెక్‌లో చేరితే కొలువే లక్ష్యం కావాలి. తొలి సెమిస్టర్‌ నుంచి ప్రణాళిక ప్రకారం చదవాలి. ఇవే ప్రాంగణ నియామకాల్లో విజయానికి దోహదపడతాయి. ఫైనల్‌ ఇయర్‌లో చూద్దామనే నిర్లక్ష్యం వద్దని ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మొదటి నుంచి లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రతి అడుగు తోడ్పడాలని సూచిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరం తరగతులు ఇటీవలే ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్లు జూనియర్లకు సూచనలిస్తున్నారు.

13 కళాశాలలు 2,700 ప్రవేశాలు

మూడు ప్రభుత్వ, పది ప్రైవేటు కళాశాలలున్నాయి. 13 కోర్సుల్లో 4,300 సీట్ల లభ్యత. ఈ విద్యా సంవత్సరం 2709 మందికిపైగా ప్రవేశాలు తీసుకున్నారు. ఇందులో సివిల్‌లో 137, సీఎస్‌ఈ 933, ఈసీఈ 624, ఈఈఈ 624, మెకానికల్‌ 166, సీఎస్‌ఎం 243 మిగితావి ఐటీ, మైనింగ్‌, సీఎస్‌ఐ, సీఎస్‌వో, టెక్స్‌టైల్‌, సీఎన్‌జీ, ఏఐఎంలో ప్రవేశాలు తీసుకున్నారు.

పోటీలో నెగ్గాలి

ఈ విద్యా సంవత్సరం 2709 మందికి పైగా విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో ప్రవేశాలు పొందారు. ఇతర నగరాలు, రాష్ట్రాల్లోనూ ఇదే సంఖ్యలో ఉన్నారంటే పోటీని అంచనా వేసుకోవాల్సిందే. ఉద్యోగం సాధించాలంటే మొదటి నుంచి నేర్పు అవసరం. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా, ఖాళీ సమయంలో కమ్యూనికేషన్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. ఏదో ఒక టెక్నాలజీపై పూర్తి అవగాహన, ప్రాజెక్టుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి.

* ఇటీవల కంప్యూటర్‌ సైన్స్‌, దాని అనుబంధ కోర్సుల్లోనే ఎక్కువ చేరుతున్నారు. ఇంగ్లిష్‌పై పట్టు సాధించి లాజికల్‌ ఆలోచన గల నైపుణ్యం, కీలకమైన సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణతకు సీ, సీ ప్లస్‌ ప్లస్‌, జావా, వెబ్‌ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ వంటి అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు డీబీఎంఎస్‌లో ప్రతిభ అవసరం.

* ఆన్‌లైన్‌ అప్టిట్యూడ్‌ పరీక్ష నిమిత్తం బేసిక్‌ ఆర్థమెటిక్‌పై షార్ట్‌కట్‌ పద్ధతిని నేర్చుకుని కంపెనీ వారు ప్రశ్నపత్రంలో కేటాయించిన సమయానికి అనుగుణంగా అన్ని విభాగాల ప్రశ్నలు రాయాలి. వందకు 60శాతం మార్కులు వస్తే తొలి రౌండులో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది.

* కళాశాలలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ (సీఆర్‌టీ)తో పాటు వివిధ సంస్థలలో పని చేసే నిపుణులతో సదస్సులు, వర్క్‌షాప్‌లో భాగస్వామ్యం అవసరం.


కొత్త కోర్సులు తోడ్పడ్డాయి

-నీలం జాహ్నవి

సీఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌. విప్రో కంపెనీ జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. అందులో ప్రతిభ చూపడంతో నాకు ఉద్యోగం వచ్చింది. కొత్తగా వచ్చిన ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడంతో జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీ పడటం సులభమైంది. మొదటి సెమిస్టర్‌ నుంచి బ్యాక్‌ లాగ్స్‌ లేకుండా చూసుకుంటే మంచిది.


ఆత్మ విశ్వాసమే ప్రధానం

-మేఘన

ఏ పరీక్షకు ఎలా సన్నద్ధమవుతున్నాం అనేది కీలకం. నేర్చుకునే అంశంపై అవగాహన అవసరం. క్రమం తప్పకుండా తరగతులు, ప్రాజెక్టులు, ల్యాబ్‌లు చేసినప్పుడే ఇది సాధ్యం. మంచి సీజీపీఏ కోసం ప్రణాళిక అవసరం. వీటితోనే ఎంఫసిస్‌లో ఉద్యోగం సాధించాను.


ఎప్పటికప్పుడు ప్రతిభకు పరీక్ష

- చంద్రమౌళి, ప్లేస్‌మెంటు ఆఫీసర్‌, వాగేశ్వరి కళాశాల

లక్ష్యానికి తగినట్టు ప్రణాళిక అవసరం. సమయం వృథా చేయకుండా ప్రతి అంశం కీలకమని భావించాలి. ఆర్థమెటిక్‌, రీజనింగ్‌పై పట్టు అవసరం. వర్క్‌షాప్‌, సెమినార్‌, వెబినార్‌లో పాల్గొని ప్రతిభను పరీక్షించుకోవాలి. 60 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించాలి. అప్పుడే బహుళ జాతి కంపెనీల ప్లేస్‌మెంటు డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.


నిరంతర అభ్యసన అవసరం

- జి.శివ రామకృష్ణ

నాలుగేళ్ల బీటెక్‌ అంటే చివరికి చూసుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. అది తప్ఫు మొదటి నుంచి బ్యాక్‌లాగ్స్‌ లేకుండా జాగ్రత్త పడ్డాను. అలాగే మంచి గ్రేడు మార్కుల ఉండాల్సిందే. పరీక్షలతో పాటు ప్రాంగణ నియామకాలు, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై సాధన చేయడం ఫలించింది. విప్రోలో ఉద్యోగం వచ్చింది. ప్రధానంగా సాంకేతిక విద్య నిరంతర అభ్యసనం అని గుర్తించాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని