logo
Published : 02/12/2021 03:38 IST

మేల్కొనండి.. టీకా తీసుకోండి

తొలిడోసు వ్యాక్సినేషన్‌ 82.82 శాతం

రెండో డోసు 32.54 శాతమే

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే

జిల్లాలో 1,30,320 మంది ఇంకా తొలిడోసు కూడా తీసుకోనివారున్నారు. రెండో డోసుకు అర్హత సాధించినవారు 3 లక్షలపైనే ఉన్నారు. కానీ వీరంతా వ్యాక్సినేషన్‌కు ఆసక్తిచూపకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. అనారోగ్య సమస్యలు, వివిధ ఆరోగ్య రుగ్మతలు సాకుగా చూపి వీరంతా టీకాలకు దూరమవుతున్నారు. కానీ కొవిడ్‌ కొత్త రూపాంతరం చెందుతోందని పలు దేశాల్లోనూ దీని తీవ్రత పెరిగిందనే సమాచారంతో దేశం, రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లావాసులు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మూడో దశపై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో కొవిడ్‌ నిబంధనలతోపాటు వ్యాక్సిన్‌తోనే సంపూర్ణ రక్షణ లభించగలదని వైద్యులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం వీడాలి..

జిల్లాలో జనాభా మేరకు 7,58,727 డోసుల్ని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 6,28,407 మంది తొలిడోసు తీసుకోగా 2,69,652 మంది మాత్రమే రెండో డోసు తీసుకున్నారు. తొలిడోసులో చూపిన ఉత్సాహం రెండో డోసుకొచ్చేసరికి నిర్లిప్తతగా మారింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతోపాటు శుభకార్యాలు పెరగడం కూడా ఇందుకు ఓ కారణమైంది. వైద్యశాఖ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శిబిరాలు ఏర్పాటు చేయడం, వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పడం ద్వారా కొంత వ్యాక్సినేషన్‌ పెరిగింది. మళ్లీ 2 నెలల నుంచి మందకొడిగా కొనసాగుతోంది. జిల్లాలో 299 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, 25 పరీక్షా కేంద్రాలున్నాయి. కోవీషీల్డ్‌ తొలి, రెండో డోసులతోపాటు కొవాగ్జిన్‌ రెండోడోసు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. శతశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యసాధనకు అధికార యంత్రాంగం ఇంటింటి సర్వే కూడా నిర్వహించింది. తొలి, రెండో డోసు తీసుకోవాల్సిన వివరాలు సైతం సేకరించారు. వైద్య సిబ్బంది ఓవైపు జనాన్ని జాగృతం చేసినా టీకాలపై నిర్లక్ష్యం ఆవహించడం గమనార్హం.

చైతన్యం అవసరం

జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు తగ్గినా మూడోదశ తీవ్రతపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. గురుకులాలు, పాఠశాలలు తెరవడంతోపాటు వేడుకల పేరిట వేలాది మంది గుంపులుగా చేరుతున్నారు. చాలా మంది సామాజిక దూరం పాటించకపోగా కొందరైతే మాస్కులు కూడా ధరించడంలేదు. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే శతశాతం టీకాలతోనే సాధ్యమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ప్రజల్లో రెండో డోసు ఆవశ్యకతపై సామాజిక సంస్థలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.

వేగవంతం చేస్తున్నాం : - రవి, కలెక్టర్‌

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 200 ప్రత్యేక బృందాలు, పట్టణాల్లో 65 బృందాలతో తొలి, రెండోడోసు టీకాలిప్పిస్తున్నాం. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం వివిధ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నాం. ప్రజలు వ్యాక్సిన్‌కు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని