logo

తాగునీటి వృథా వద్దు : కలెక్టర్‌

అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు

Published : 28 Mar 2024 05:30 IST

సమావేశంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌
కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పనుల ప్రదేశంలో తగిన వసతులు కల్పించాలన్నారు. విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డీఆర్‌వో పవన్‌కుమార్‌, డీపీవో రవీందర్‌, సీపీవో కొమరయ్య, డీఆర్డీవో శ్రీధర్‌, జిల్లా వైద్యాధికారి సుజాత, జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

నిర్లక్ష్యం వీడండి..

 కరీంనగర్‌ కలెక్టరేట్‌ : పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యాన్ని వీడాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఈఈలు, ఏఈలు, డీఈలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేయకపోతే నిధులు లాప్స్‌ అయ్యే అవకాశం ఉందని.. రాత్రింభవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్పెషల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. తాగునీటి సరఫరాకు 210 అత్యవసర పనులు చేపట్టేందుకు వివిధ గ్రాంట్ల కింద రూ.5.08 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అంజన్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈ రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 మీడియా సెంటర్‌ ప్రారంభం

కరీంనగర్‌ కలెక్టరేట్‌: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎంసీఎంసీ)ను కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు అందించేందుకు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని