logo

అడవిని మింగేస్తున్న అనకొండలు

దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి.

Published : 27 Apr 2024 05:17 IST

వందలాది ఎకరాల్లో పచ్చని చెట్ల నరికివేత
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

ట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నిత్యం ఇదే తంతు జరుగుతోంది. ఆక్రమణదారులు యథేచ్ఛగా చెట్లు నరికివేస్తూ మైదానంలా మారిన భూమిలో ట్రాక్టర్లతో వ్యవసాయానికి అనువుగా చదును చేస్తున్నారు.

జిల్లాలోని వేములవాడ అటవీ డివిజన్‌లో చెట్ల నరికివేత నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ చేసిన దగ్గర నుంచి ఇది మరింత ఎక్కువైంది. గిరిజనులు, గిరిజనేతరులు ఇలా ఎవరికి వారు చెట్లను నరుక్కుంటూ పోతున్నారు. ఒకప్పుడు రహదారి పక్కన కొంతదూరం దట్టమైన చెట్లు కనిపించేవి. అడవి లోపల మైదానంలా ఉండే ప్రాంతంలో మాత్రమే చెట్లు నరికి పోడు చేసుకునేవారు. ప్రస్తుతం సాగుకు అనువుగా లేని బండరాళ్లు ఉన్న ప్రాంతాలను సైతం వదలడం లేదు. ఇక్కడి అటవీ ప్రాంతంలో కలపకు ఉపయోగపడే చెట్లు తక్కువగా ఉన్నాయి. గిరిజన గూడేల్లో ఎవరి ఇంటి ముందు చూసినా నరికిన చెట్ల కర్రలను కుప్పగా పేర్చిన దృశ్యాలు కనిపిస్తాయి.

  • రుద్రంగి మండలం మానాల శివారు నిజామాబాద్‌ జిల్లా దేవక్కపేట, భీంనగర్‌లో ఇటీవల వందల ఎకరాల్లో చెట్లను నరికివేశారు. ఆయా గ్రామాల శివారులో ఇప్పటికే అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. వీటికి సమీపంలోని అడవిలోని చెట్లను నరుక్కుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఒక్కొక్కరు సగటున 10-15 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
  • మానాల సమీపంలోని తొమ్మిది గిరిజన గూడేల్లోని వారికి గతేడాది 1,700 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. పోడు పట్టాల పంపిణీలో స్థానికులే కమిటీ సభ్యులుగా ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేయొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వారికి ఇచ్చిన పోడు పట్టాలకు సమీపంలో రెండింతలు అటవీ భూమిని చదును చేసుకుంటున్నారు.
  • రుద్రంగి శివారులోని మల్లన్నస్వామి ఆలయ సమీపంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసి ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే సూరమ్మ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గైరిగుట్ట, అడ్డబోరు తండాలకు చెందిన వారు 40 ఎకరాలను చదును చేశారు.
  • జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం పోతారం, కలికోట శివారులోని చెరువు సమీపంలో 60 ఎకరాలపైన, కొత్తపేట, తుర్తి శివారులో 30 ఎకరాల్లో చెట్లను నరికివేశారు.
  • చందుర్తి మండలం సనుగులలోని పెసల్లబండలో గిరిజనేతరులు సుమారు 50 ఎకరాల వరకు చెట్లను నరికివేసి సాగుకు అనువుగా ట్రాక్టర్లతో చదును చేశారు. అలాగే తిమ్మాపూర్‌, రామన్నపేట, నర్సింగాపూర్‌ శివారులో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి అటవీ భూముల్లోకి వెళ్లి చదును చేస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

అధికారులపైనే నిఘా

టవీ బీట్‌ అధికారుల కదలికలపై స్థానికుల నిఘా నిరంతరాయంగా ఉంటుంది. వారు తనిఖీలకు వస్తున్న విషయాన్ని అడవిలో ఉంటున్న వారికి సమాచారం చేరవేస్తారు. అధికారులు లోపలికి వెళ్లేలోపు అక్కడ ఎవరూ ఉండరు. వీరికి ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఉంది. ఒకరిద్దరు అధికారులు తనిఖీలకు వెళ్తే తిరగబడతారు. ఇటీవల రుద్రంగి మండలం అడ్డబోరు తండాలో బీట్‌ అధికారి బాలకృష్ణపై రాళ్లతో దాడి చేశారు. కొత్తపేటలో మహిళా బీట్‌ అధికారిపైకి తల్వార్‌తో దాడి చేసేందుకు వచ్చినట్లు సమాచారం. అటవీ భూముల్లోకి చొరబడి అక్రమంగా సాగుచేస్తున్న వారి నుంచి కొందరు అధికారులు ఏటా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సాగు చేసుకునే విస్తీర్ణాన్ని బట్టి ముట్టజెబుతారని తెలుస్తోంది. అందుకే వారి పరిధి దాటి ఎంతమేరకు ఆక్రమణలకు పాల్పడినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


కేసులు నమోదు చేశాం

- గౌసొద్దీన్‌, అటవీ సెక్షన్‌ అధికారి

ఎన్నికల విధుల్లో ఉండగా చెట్లను నరికివేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతాలను పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేశాం. దీంతోపాటు అటవీ భూమిలో చదును చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నాం. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, చొరబాట్లను కట్టడి చేసేందుకు రాత్రి సమయంలో బేస్‌క్యాంపులను ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనం ద్వారా గస్తీ తిరుగుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని