logo

హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం

పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.

Published : 27 Apr 2024 05:11 IST

2024-25లో 5 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయం
న్యూస్‌టుడే, ముస్తాబాద్‌

ల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం తొమ్మిదో విడతలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయా నర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తున్నారు. వీటిని నాటేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు గాను అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో 8 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అధికారులు మాత్రం 2023-24 సంవత్సరానికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో కలిపి 5 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకు నర్సరీల్లో కానుగ, గన్నేరు, గుల్మోరా, ఫెల్టోఫాం, మర్రి, రావి, పథోడియాతోపాలు రకాల మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇళ్లలో నాటేందుకు గులాబీ, మల్లె, మందార, జామ, దానిమ్మతోపాటు పలు రకాల మొక్కలను సంరక్షిస్తున్నారు. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా ఉపాధి హామీ కూలీలు నిత్యం మొక్కలకు నీరందిస్తున్నారు. జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకు 4.71 కోట్ల మొక్కలు నాటినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 90 శాతం బతికినట్లు చెబుతున్నారు. గతంలో నాటిన వాటిలో ఎక్కడైనా ఎండిపోతే వాటి స్థానంలో తిరిగి నాటేందుకు మండల స్థాయి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.


గుంతలు సిద్ధం చేస్తాం

- బొయిడి శేషాద్రి, డీఆర్డీవో

జిల్లాలో 2024-25 సంవత్సరంలో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నర్సరీల్లో మొక్కలను సంరక్షించే బాధ్యతను గ్రామ పంచాయతీలే చూస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో వాటిపై చలువ పందిళ్లు వేశారు. జూన్‌ మొదటి వారంలో నాటేందుకు గుంతలను సిద్ధం చేస్తాం. వర్షాలు కురవగానే నాటుతాం. ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల ఆవరణలు, రోడ్డు పక్కల నాటే వాటితోపాటు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు పండ్లు, పూల మొక్కలను కూడా పెంచుతున్నాం. గతంలో నాటినవి ఎండిపోతే, తిరిగి నాటేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు