logo

కబ్జాల పర్వం!

అక్రమార్కుల కన్ను మున్సిపల్‌ లేఅవుట్‌ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్‌ లేఅవుట్‌ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్‌ కావడమే ఇందుకు నిదర్శనం.

Published : 27 Apr 2024 05:14 IST

నలుగురి పేర మారిన పురపాలక స్థలం
న్యూస్‌టుడే, వేములవాడ

అక్రమార్కుల కన్ను మున్సిపల్‌ లేఅవుట్‌ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్‌ లేఅవుట్‌ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్‌ కావడమే ఇందుకు నిదర్శనం. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి అందులో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తే అది మున్సిపల్‌ లేఅవుట్‌ కింద కేటాయించిన 10 శాతం స్థలమనే విషయం తెలియడంతో కంగుతిన్నాడు.

వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇదే తరహాలో అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పలు సందర్భాల్లో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్రమణల పర్వం ఆగడం లేదు. వేములవాడ పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో కొన్నాళ్లుగా స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేములవాడ పట్టణం, విలీన గ్రామాల్లో దాదాపు 40 సర్వే నంబర్లలో లే అవుట్‌లు వేశారు. దీంతో ఆయా లేఅవుట్‌లలోని పది శాతం స్థలాన్ని ప్రజా అవసరాల కోసం పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా రిజిస్ట్రేషన్‌ చేసి స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. తరవాత వేరొకరికి విక్రయిస్తున్నారు. అధికారులు నామమాత్రంగా రక్షణ చర్యలు చేపట్టడం అక్రమార్కులకు వరంగా మారింది.

పర్యవేక్షణ లేక...

పురపాలక సంఘానికి రూ.కోట్ల విలువ చేసే స్థలాలున్నా అధికారుల పర్యవేక్షణ కరవైంది. దీంతో అక్రమార్కులు ఏ కొద్ది అవకాశం దొరికినా కబ్జా చేసేందుకు చూస్తున్నారు. నాంపల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో 2006లో ఓ సర్వే నంబరులో లే అవుట్‌ కింద స్థలాన్ని కేటాయించారు. తరవాత మున్సిపల్‌లో విలీనం కావడంతో ఆ స్థలాన్ని మున్సిపల్‌ ఆధీనంలోకి తీసుకుంది. అయితే దానికి ఆక్రమించి ఇతరులకు విక్రయించేశారు. ఇలా నలుగురి చేతులు మారిన డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. స్థలాలు కోట్లాది రూపాయల విలువ చేసేవి కావడంతో అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పక్కన ఉన్న సర్వే నంబర్ల ద్వారా కబ్జాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది వీటి రక్షణకు దాదాపు రూ.10 లక్షల నిధులతో మున్సిపల్‌ అధికారులు వాటి చుట్టూ ఇనుప వైర్‌తో పెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనులు సైతం తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. చాలా వాటికి పెన్సింగ్‌ ఏర్పాటు చేయకుండానే వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి లే అవుట్‌ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.


చర్యలు తీసుకుంటున్నాం

- అన్వేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

మున్సిపల్‌ స్థలాల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రూ. 10 లక్షలు వెచ్చించి స్థలాల చుట్టూ పెన్సింగ్‌ ఏర్పాటు చేశాం. కోర్టు వివాదంలో ఉన్న వాటికి ఏర్పాటు చేయలేదు. నాంపల్లిలో మున్సిపల్‌ స్థలం కొనుగోలు చేసిన వారు నిర్మాణ అనుమతికి కార్యాలయానికి వస్తే లేఅవుట్‌ స్థలం కింద మున్సిపల్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందని చెప్పాం. మున్సిపల్‌ లేఅవుట్‌ స్థలాలు ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని