logo

వామ్మో.. ఇదేం ఎండ!

జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి.

Published : 19 Apr 2024 04:09 IST

ఉక్కపోతతో జనం సతమతం
వెల్గటూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

కరీంనగర్‌ : మండే ఎండలకు టోపీలు, చున్నీలే రక్ష

మాడు అదిరేలా.. జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు జనం అల్లాడారు. రోజంతా ఫ్యాన్‌లు, ఏసీలు, కూలర్లు నడిచినా ఉపశమనం దక్కలేదు. వడగాలి ప్రభావం మధ్యాహ్నం వేళలో విపరీతమైంది. కరీంనగర్‌లో గురువారం 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా.. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండల కేంద్రంలో 45 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో జనం ఇబ్బంది పడ్డారు. మరో రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో నాలుగు జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరిగే వారు, పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ప్రచారంపై ప్రభావం..

మిట్ట మధ్యాహ్నం వేళ లోక్‌సభ ఎన్నికల సందడి అంతగా కనిపించడం లేదు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం అక్కడక్కడా పార్టీలు సమావేశాలను నిర్వహిస్తున్నా నేతలు ఉక్కపోతతో సతమతమవతుఉన్నారు. అభ్యర్థులు ఉదయం, సాయంత్రం ప్రచారాలకే మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రచారం పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇక ముఖ్యనేతల రోడ్‌షోలు, ప్రసంగాల సమావేశాల్ని రాత్రి వేళల్లో పెట్టే విధంగా పోటీదారులు ఆసక్తిని చూపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని