logo

పది ఫలితాల్లో అదుర్స్‌

పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది.

Updated : 01 May 2024 05:23 IST

రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం
98.27 శాతం ఉత్తీర్ణత

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, సిరిసిల్ల(విద్యానగర్‌), ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది 95.7 శాతంతో ఏడో స్థానంలో ఉండగా ఈసారి మరింత ముందుకెళ్లింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 6,470 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 6,358 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3,079 మందికి 3,000, బాలికలు 3,391 మందికి 3,358 మంది పాసయ్యారు. 99.03 శాతంతో బాలికలు పైచేయి సాధించారు. 135 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 34 మంది బాలురు, 77 మంది బాలికలు పది జీపీఏ సాధించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు నాలుగు నెలల ముందు వరకు సబ్జెక్ట్‌ టీచర్లు, భాషాపండితుల కొరత ఉంది. 2023 సెప్టెంబరులో జరిగిన స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులు, బదిలీలతో ఖాళీలు ఏర్పడ్డాయి. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ తర్వాత ఖాళీలు ఉన్న చోట పాఠశాలల కాంప్లెక్స్‌ల పరిధిలోని ఉపాధ్యాయులను బట్టి సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్నచోట వారికి అందుబాటులో ఉన్న ఎస్జీటీలతో బోధన కొనసాగించేలా ప్రణాళికలు చేశారు. దీంతో సకాలంలో పాఠ్యాంశాల పూర్తి, పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వెనకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాల నిపుణుల పర్యవేక్షణలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో మంచి ఫలితాలు సాధించారు.

19 ఏళ్లుగా వందశాతం...

తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని బాలికల గురుకుల విద్యాలయం 19 ఏళ్లుగా పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధిస్తోంది. ఇందులో 2005లో తొలిసారి పదో తరగతి ప్రారంభమైంది. ఈసారి 80 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా అందులో ఆరుగురు పది జీపీఏ, 59 మంది 9 జీపీఏ సాధించారు. వరుసగా వందశాతం ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధ, ఉపాధ్యాయుల బృందాన్ని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ అభినందించారు.


ఒత్తిడికి గురికావొద్దు
- రమేశ్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి

ఫెయిల్‌ అయిన విద్యార్థులు జూన్‌ 3 నుంచి 14 వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలి. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. మే 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దు. జిల్లాలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అభినందనలు.


వైద్యురాలు కావడమే లక్ష్యం
- గాజుల అక్షయ, 10 జీపీఏ, వెంకంపేట జడ్పీహెచ్‌ఎస్‌, సిరిసిల్ల

మా నాన్న గాజుల రమేశ్‌ మరమగ్గాల కార్మికుడు. తల్లి రేఖ బీడీ కార్మికురాలు. వారి కష్టం వృథా కాకూడదని కష్టపడి చదివాను. ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నాను. బాగా చదువుకొని మంచి వైద్యురాలు కావడమే లక్ష్యం.


నేవీ అధికారి కావాలని...
- దూస మనోజ్‌, 10 జీపీఏ, గీతానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ (జీ)

మా నాన్న రాజు మరమగ్గాల కార్మికుడు. అమ్మ లావణ్య బీడీలు చుడుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే 10 జీపీఏ సాధించాను. కష్టపడి చదివాను. పాఠ్యాంశాలను విభజించుకుంటూ చదివాను. భవిష్యత్తులో బాగా చదువుకొని నేవీ అధికారి కావడమే నా లక్ష్యం.


ఇంజినీరు అవ్వాలని...
- మోతె శివమణి, ముస్తాబాద్‌

అమ్మ లావణ్య, నాన్న నర్సింలు దర్జీ పనులు చేస్తుంటారు. అక్కయ్య ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం సన్నద్ధమవుతుంది. అమ్మానాన్నలు కష్టపడి మమ్ములను చదివిస్తున్నారు. పదో తరగతి నామాపూర్‌ ఆదర్శ పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాను. నేను బాగా చదువుకొని ఇంజినీరునై తల్లిదండ్రులకు అండగా నిలుస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని