logo

ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Updated : 01 May 2024 05:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న తెజస వ్యవస్థాపకుడు కోదండరాం

ఈనాడు, పెద్దపల్లి: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లిలో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం-పార్లమెంట్‌ ఎన్నికలు మన కర్తవ్యం’ అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఆ పార్టీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు. గతంలో కేసీఆర్‌ కూడా ‘రాజ్యాంగాన్ని మార్చాల్సిందే’ అంటూ మాట్లాడారని, ఈ రెండు పార్టీలను ఓడించి ఇండియా కూటమిని బలపరిచేలా కాంగ్రెస్‌ను గెలిపించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని పదేళ్ల కిందట చెప్పిన భాజపా ఇప్పటివరకు ఒక్కరి ఖాతాలోనూ పైసా కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న భాజపాకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ వంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు వాడుతోందన్నారు. అధికారంలో ఉండగా భారీగా అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ మరోసారి ఓట్లు దండుకునేందుకు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, తెజస నాయకులు డొంకెన రవి, సీనియర్‌ జర్నలిస్టు మునీర్‌, ఉద్యమకారుడు కోట శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని