logo

పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం

ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

Updated : 01 May 2024 05:21 IST

మండుతున్న ఎండలకు తగ్గిన విద్యుత్తు రాయితీ అర్హులు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఓ వినియోగదారుడికి మార్చి నెలలో 787 రాయితీ వర్తింపు, ఏప్రిల్‌లో వచ్చిన రూ.2,065 బిల్లు  

ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాడకం రెట్టింపు కావడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగం పెరగడంతో జీరో బిల్లు కోల్పోవాల్సి వస్తోంది. రెండు నెలల లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే విద్యుత్తు వాడకం అధికంగా ఉంది. గత నెలలో వంద యూనిట్ల లోపు వాడిన వినియోగదారులు ప్రస్తుత నెలలో వందపైనా వినియోగించడంతో రాయితీ సొమ్ము పెరిగినట్లయింది. విద్యుత్తు పొదుపుగా వాడాలని అవగాహన కల్పించినప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

తగ్గుదల ...

జిల్లాలో పెద్దపల్లి, మంథని డివిజన్‌ పరిధిలో మొత్తం 2,06,518 కనెక్షన్లు వాడకంలో ఉన్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్‌ కార్డు కలిగిన వారి నుంచి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు దొర్లాయి. విద్యుత్తు కనెక్షన్‌ సంఖ్య సక్రమంగా నింపకపోవడం, రేషన్‌ కార్డు సంఖ్య తప్పుగా రాయడంతో రాయితీకి దూరమయ్యారు. జిల్లాలో మార్చిలో 1,10,346 కనెక్షన్లకు రూ.345.90 లక్షల రాయితీ వర్తించింది. ఏప్రిల్‌లో 1,06,363 కనెక్షన్లకు రూ.422.90 రాయితీ పొందారు. విద్యుత్తు కనెక్షన్లు తగ్గినప్పటికీ రాయితీ సొమ్ము పెరిగింది. గృహ అవసరాలకు విద్యుత్తు వినియోగం పెరగడంతో రాయితీ సొమ్ము అధికమైంది. 200 యూనిట్లు దాటడంతో ఈ సారి బిల్లులు చెల్లించాల్సి వచ్చింది.

పొదుపుతోనే రాయితీ

మండుతున్న ఎండలు 200 యూనిట్ల కంటే అధికంగా వినియోగిస్తుండటంతో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మార్చి నెలలో 164 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 120 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగించారు. వరి, ఇతర పంటలు కోతలకు రావడంతో వ్యవసాయానికి వినియోగం తగ్గింది. కేవలం గృహ అవసరాలకు మాత్రమే వాడటంతో ఏప్రిల్‌ విద్యుత్తు డిమాండ్‌ కాస్తా తగ్గింది. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరంగా నడుస్తుండటంతో జీరో బిల్లు పొందలేకపోతున్నారు. పొదుపుగా విద్యుత్తు వినియోగిస్తే రాయితీ సొమ్ము పొందే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని