logo

ద్వితీయంలో 4.. ప్రథమంలో 5

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు.

Updated : 25 Apr 2024 06:34 IST

రాష్ట్రంలో జిల్లా స్థానాలివి
ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు

న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో దీటుగా మార్కులు సాధించారు.

ప్రభుత్వ కళాశాలల హవా..

జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 950కిపైగా మార్కులు సాధించారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన ఎం.రిషిత పటేల్‌ ఎంపీసీలో 983, యు.సాయిప్రియ ఎంపీసీలో 977, బైపీసీలో సానఅంజుమ్‌ 968, సీఈసీలో మిష మహ్విన్‌ 965 మార్కులు పొందారు. ప్రభుత్వ సైన్స్‌ కళాశాల విద్యార్థి సాయితేజ బైపీసీలో 965, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి జిషన్‌ బిన్‌ బక్రన్‌ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆదర్శ పాఠశాలల్లోనూ ఉత్తమ మార్కులు వచ్చాయి. గంగాధర ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆర్‌.వర్షిణి ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు కైవసం చేసుకుంది.

నేటి నుంచి రీకౌంటింగ్‌

అందరి కృషితో ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈసారి కళాశాలలకు సెలవులు తక్కువగా రావడంతో విద్యార్థులు కష్టపడి చదివారు. అన్ని కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల కృషితో గతేడాది ఫలితాల కంటే ఈసారి మెరుగైన స్థానం సాధించాం. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ చేయించుకోవాలనే ఆసక్తి గల వారు గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీలోపు రుసుంలు చెల్లించాలి.

జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

భళా బాలికలు..

  • ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 63.41 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. గతేడాది అదే స్థానంలో ఉండటం విశేషం. మొత్తం 15,058 మంది పరీక్షకు హాజరుకాగా 9548 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 56.13, బాలికలు 71.64గా నిలిచారు.
  • ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 74.39 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానం పొందడం విశేషం. గతేడాది 8 స్థానంలో ఉండగా.. ఈసారి మెరుగైంది. మొత్తం 13,407 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 9974 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 69.14, బాలికలు 79.99గా నిలిచారు.
  • ఒకేషనల్‌ ఫలితాల్లో ఈసారి జిల్లా కొంత వెనకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 42.64 శాతంతో 32 స్థానంలో నిలిచింది. గతేడాది జిల్లా 31 స్థానంలో ఉంది. మొత్తం 1543 మంది హాజరుకాగా, 658 మంది ఉత్తీర్ణులయ్యారు.
  • ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 57.62 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 29 స్థానాన్ని అందుకుంది. గతేడాది  28 స్థానంలో నిల్చింది. మొత్తం 1437 మంది పరీక్షలు రాయగా 828 మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని