logo

చిన్నబోయిన బొంకూర్‌

వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.

Updated : 06 May 2024 06:32 IST

కాల్వలో బోల్తా పడిన ట్రాక్టర్‌

వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. తాము ఏరిపోసిన కంకులే తమమీద మృత్యుబండలై ప్రాణాలు తోడేస్తాయని ఊహించలేదు. ఇంకో పది నిమిషాల్లో ఇళ్లకు చేరుకునేవారే. అంతలోనే ఊహించని ప్రమాదంతో ముగ్గురు అనంతలోకాల్లో కలిసి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచారు.  

న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌


ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతిచెందగా బాధిత కుటుంబాలు ఘొల్లుమన్నాయి. మృతిచెందిన మహిళలు, చికిత్స పొందుతున్న వారితో తమకున్న అనుబంధాలను స్థానికులు గుర్తు చేసుకొంటూ కన్నీరుపెట్టారు. సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ శివారులో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో చిన్నబొంకూర్‌లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల్లో ఏ కుటుంబాన్ని చూసినా కన్నీటి గాథలే కనిపించాయి. క్షతగాత్రులు పోచంపల్లి పద్మ, ఈజ్జగిరి రాజమ్మ, విజ్జగిరి రమ, కానుగుల సరిత, పోచంపల్లి లక్ష్మిలు కరీంనగర్‌లో చికిత్స పొందుతుండగా.. వారి కుటుంబాల్లో ఆందోళన పరిస్థితి తలెత్తింది.

అన్నీ తానై..

చిన్నబొంకూర్‌కు చెందిన పోచంపల్లి రాజమ్మ భర్త రాజకొమురయ్య ఏడేళ్ల క్రితం మృతిచెందారు. రాజమ్మ అన్నీ తానై.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపింది. ఇద్దరు కుమారుల వివాహాలు జరిపించింది. కొడుకులు, కోడళ్లు గ్రామంలో కూలీ పనులు చేస్తూ ఉమ్మడి కుటుంబంగా కొనసాగుతున్నారు. ఇంటికి పెద్దదిక్కైన రాజమ్మ ఇక లేరనే విషయాన్ని కొడుకులు కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

కుమారుడి పెళ్లి చూడకుండానే..

జూలపల్లి మండలం తేలుకుంటకు చెందిన బేతి లక్ష్మి, మహిపాల్‌రెడ్డి ఉపాధి కోసం చిన్నబొంకూర్‌కు వచ్చారు. కూలీనాలి చేసి రెండెకరాలు కొనుగోలు చేశారు. వ్యవసాయంతో పాటు పలు కూలీ పనులు చేస్తూ కుమార్తె వివాహం చేశారు. కొడుకును డిప్లొమా చదివించి మందమర్రి ఓపెన్‌కాస్టులో తాత్కాలిక ఉద్యోగిగా చేర్చించారు. త్వరలోనే వేణుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని మహిపాల్‌రెడ్డి విలపించారు.

చిన్నారులను ఓదార్చేదెలా?

చిన్నబొంకూర్‌కు చెందిన మల్యాల వెంకటేశ్‌ దంపతులకు పన్నెండేళ్లలోపు కొడుకు అర్జున్‌, కుమార్తె సహస్ర సంతానం. వెంకటేశ్‌ అన్నదమ్ముల పొత్తులో ఉన్న 5 ఎకరాలతోపాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ట్రాక్టర్‌ ప్రమాదంతో తన చేజేతులా భార్యను చంపుకొన్నానని వెంకటేశ్‌ ఘొల్లుమన్నారు. ఇంటి వద్ద చిన్నారులు అన్నం తింటున్న క్రమంలో తల్లి మరణవార్త తెలిసింది. సగం అన్నం తిన్న ప్లేట్లు అలాగే ఉండిపోగా.. చిన్నారుల దుఃఖం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.  

రాజమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని