logo

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

లోక్‌సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్‌ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు.

Published : 07 May 2024 02:11 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్‌ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎన్నికల పోలింగ్‌కు తీసుకోవాల్సిన చర్యలపై సెక్టోరియల్‌ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రకారం ప్రతి ఓటరుకు బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటర్‌ సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో ఇటీవల కాలంలో మరణించిన వారి వివరాలు పంచాయతీ కార్యదర్శి ద్వారా సేకరించి ఓటరు జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ప్రతి మండలంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఎంపీడీవోలు పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద తప్పనిసరిగా తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఉన్నందున, అమ్మ అభివృద్ధి కమిటీల ద్వారా చేపడుతున్న తాగునీరు, టాయిలెట్ల పనులు పోలింగ్‌ కంటే ముందే ముగిసేలా వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద తప్పనిసరిగా కూలర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి తరలించేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ముందుగా మాక్‌ పోల్‌ పూర్తి చేయాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్‌ వివరాలను రిపోర్ట్‌ చేయాలన్నారు. మొదటి రెండు గంటల పోలింగ్‌ అత్యంత కీలకమని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో సిరిసిల్ల సహాయ రిటర్నింగ్‌ అధికారి పూజారి గౌతమి, ఆర్డీవో రమేశ్‌, సెక్టార్‌ అధికారులు, సీపీవో శ్రీనివాసచారి, ఎంపీడీవోలు, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు శ్రీకాంత్‌, ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని