logo

కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన

కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్‌ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సునీతారాణి తెలిపారు.

Updated : 07 May 2024 06:02 IST

2 గంటల పాటు ఓపీ సేవల బహిష్కరణ

  కోరుట్ల ఏరియా ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న వైద్య సిబ్బంది

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్‌ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సునీతారాణి తెలిపారు. ఆదివారం నజీబుల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందిన ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు విచక్షణా రహితంగా ఫర్నిచర్‌ ధ్వంసం చేయడంతోపాటు, వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం వైద్యులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి నుంచి పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని విధుల్లో పాల్గొన్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటలసేపు ఓపీ సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌వో) సుదక్షణదేవి, డీఎంహెచ్‌వో శ్రీధర్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఫర్నిచర్‌ను పరిశీలించి, వైద్య సిబ్బందిపై దాడి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీసీహెచ్‌వో మాట్లాడుతూ కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై డాక్టర్లు రామకృష్ణ, బషీర్‌లతో కమిటీని నియమించామన్నారు. వీరు రెండు రోజుల్లో ఆసుపత్రిని పరిశీలించి వైద్య సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. కోరుట్ల ఆసుపత్రి వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు(టీజీడీఏ), ఐఎంఏ సభ్యులు మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని