logo

ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి.

Updated : 08 May 2024 06:13 IST

ప్రత్యేకతల నిలయం కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం

భక్తులతో రాజన్న ఆలయ ప్రాంగణం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. దశాబ్ద కాలంలో నిర్మాణమైన జలాశయాలతో పర్యాటకంగానూ ఈ ప్రాంతం ఆకట్టుకుంటోంది. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడమే కానీ, పనుల్లో పెద్దగా పురోగతి ఉండటం లేదన్న విమర్శలున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ కేంద్ర ప్రభుత్వం చొరవతో పరిధిలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల విశిష్టతలు, అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై కథనం.


కొండగట్టు అంజన్న

అంజన్న ఆలయం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. సమీపంలో రైల్వే స్టేషన్‌ ఉన్నా పెద్దగా రైళ్లు అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రూ.100 కోట్లు ప్రకటించడంతో యంత్రాంగం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉండగా, ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో అటకెక్కాయి. గుట్టపై విడిది కేంద్రాల నిర్మాణం చేపట్టాలి. మౌలిక వసతులు మెరుగుపడాల్సి ఉంది. హనుమాన్‌ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. వీరికోసం ప్రత్యేకంగా మాల విరమణ మండపం నిర్మించాల్సి ఉంది. గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గం మరమ్మతులు చేయాలి. ఘాట్‌ రోడ్డును రెండు వరుసలుగా విస్తరించాలి.


కారిడార్‌ జాడెక్కడ..

రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్‌ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వ సాయం తోడైతేనే పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలను కలిపే 151.36 కిలోమీటర్ల మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే మార్గం ఉంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు రైల్వే మార్గం పూర్తికావడంతో ఇక్కడి వరకు రోజూ ప్యాసింజర్‌ రైలు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం సిద్దిపేట-సిరిసిల్ల మధ్య రైల్వేలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలోని కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ రైల్వే మార్గం పూర్తయితే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారు ఈ మూడు ప్రసిద్ధ ఆలయాలతోపాటు బాసర సరస్వతీ, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాలకు వెళ్లడం సులభం అవుతుంది.


వేములవాడ రాజన్న

వేములవాడ చాళుక్యుల కాలం నుంచి వైభవాన్ని సంతరించుకున్న శ్రీరాజరాజేశ్వర దేవస్థానానికి ప్రత్యేక పర్వదినాలు, మేడారం జాతర, శివరాత్రి, శ్రీరామనవమి సమయాల్లో భక్తులు లక్షల్లో వస్తుంటారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశారు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణానికి రెండువైపులా బాహ్యవలయ రహదారులు, గుడిచెరువు విస్తరణ జరిగింది. అభివృద్ధి పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు భూ సేకరణ జరిగినా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. గతేడాదే హైదరాబాద్‌లోని వీటీఏడీఏ కార్యాలయాన్ని వేములవాడకు మార్చారు. 2019 ఎన్నికల సమయంలో పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్‌)లో చేర్చేందుకు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. భక్తులు పెరగడంతో ప్రస్తుతం ఉన్న వసతి సదుపాయాలు సరిపోవడం లేదు. సత్రాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాంపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిధిలో విడిది కేంద్రాల ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు.


విహార కేంద్రాలుగా జలాశయాలు

ఈ నియోజకవర్గ పరిధిలోనే ఎల్‌ఎండీ, ఎంఎండీ జలాశయాలు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఇటు అన్నపూర్ణ జలాశయం పూర్తిగా గుట్టల మధ్యలో ఉండటంతో నీరు నిండుగా ఉన్నప్పుడు పాపికొండలను తలపిస్తోంది. ఈ మూడు జలాశయాలను పర్యాటకంగా, బోటింగ్‌తో విహార యాత్రలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఈ జలాశయాల పరిసరాలు లఘు, కొన్ని మధ్య స్థాయి చిత్రాల నిర్మాణాలకు నెలవుగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాల్లో వీటిని చేర్చి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు