logo

పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్‌ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్‌శాతం నమోదు కావడం లేదు.

Updated : 08 May 2024 06:11 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్‌ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్‌శాతం నమోదు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు బాధ్యతగా తమ ఓటుహక్కు  వినియోగించుకుంటుండటం గమనార్హం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలోని పోలింగ్‌ శాతమే దీనికి నిదర్శనం. ప్రతి ఎన్నికల్లో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యావంతుల్లో ఓటు వినియోగంపై ఎలాగో అవగాహన ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తున్నప్పటికీ చాలామంది ఓటు హక్కు వినియోగంపై బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో అత్యల్పంగా కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమకు చెందిన ఓ కాలనీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కేవలం 24.35 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదయింది. ఈ కేంద్రంలో మొత్తం 542 ఓటర్లుండగా కేవలం 132 మంది మాత్రమే ఓటు వేశారు. ఇదే కాలనీలోని మరో నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోనూ 31.76 శాతం నుంచి 44 శాతం వరకు మాత్రమే నమోదయింది. మరో ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కార్మికులు అధికంగా నివసించే అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో 37.43 శాతం నుంచి 49.91 శాతం మాత్రమే నమోదైంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన కుక్కలగూడూరులో నియోజకవర్గంలోనే అత్యధికంగా 87.95 శాతం నమోదయింది. ఈ కేంద్రంలో 730 మంది ఓటర్లుండగా 642 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామగుండం నియోజకవర్గం మొత్తంలో 68.71 శాతం నమోదుకాగా అత్యధికంగా విద్యావంతులు, ఉద్యోగులు నివసించే కాలనీల్లో సరాసరి పోలింగు శాతానికంటే తక్కువగా నమోదుకాగా గ్రామాల్లో మాత్రం సరాసరికి మించింది. కుందనపల్లిలో 84.82 శాతం, జయ్యారంలో 84.57, పాలకుర్తిలో 83.08, ఈసాల తక్కళ్లపల్లిలో 82.23 శాతం నమోదయింది. ఈసారి రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కాగా సోమవారం ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించారు. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం ఎలా ఉంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు