logo

ఇందూరు.. హోరాహోరీ పోరు

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

Updated : 08 May 2024 06:10 IST

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ మ్యాప్‌

న్యూస్‌టుడే, జగిత్యాల: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. నియోజకవర్గంలో 17,04,867 మంది ఓటర్లుండగా అందులో 8,06,220 మంది పురుషులు, 8,98,647 మంది స్ల్రీలున్నారు. పురుషుల కంటే 97,427 మంది స్త్రీలు అధికంగా ఉన్నారు.

నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా ప్రధానంగా రైతులు, గల్ఫ్‌, బీడీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పసుపుబోర్డు ప్రచారాస్త్రం కాగా ఈ సారి చక్కెర కర్మాగారం ప్రధానాంశంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా బీడీ కంపెనీలు, ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కచ్చితంగా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో బీడీ కార్మికులందరికీ పింఛన్‌, ఉపాధిహామీ కూలీల వేతనం రూ.400కు పెంచుతామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌ రెడ్డి ఎన్నికల షెడ్యూలుకు ముందే జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించి నిజామాబాద్‌ జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఆ జిల్లాకు శాసనమండలి సభ్యునిగా సుపరిచుతుడైనప్పటికీ 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో నిజామాబాద్‌లోనే నివాసముంటూ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. భాజపా, భారాస అభ్యర్థులు ధర్మపురి అరవింద్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు కాగా అక్కడ ప్రచారం నిర్వహిస్తూనే జగిత్యాల, కోరుట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. సిట్టింగ్‌ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ భాజపా నాయకులు, శ్రేణులతో అన్ని మండల కేంద్రాల్లో కార్నర్‌ సమావేశాలు నిర్వహించగా భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులపైనే ఆధారపడి ప్రచారం సాగిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌, భాజపాలకు ఇద్దరేసి శాసనసభ్యులుండగా భారాసకు ముగ్గురు శాసనసభ్యులున్నారు.

సమస్యలపైనే గురి

ప్రధాన రాజకీయ పార్టీలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై గురిపెట్టి ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రధానంగా ముత్యంపేట, బోధన్‌ చక్కెర కర్మాగారాల పున:ప్రారంభం, గల్ఫ్‌ బోర్డ్‌ ఏర్పాటు, బీడీ కార్మిలకు పింఛన్లను ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. భాజపా పసుపుబోర్డు, రైతుల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి పేరిట ప్రచారం సాగిస్తోంది. భారాస స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలపై గురి పెట్టింది. ఎన్నికల తేదీ సమయం దగ్గర పడుతుండటంతో ఎండవేడిమిని కూడా లెక్క చేయకుండా ప్రచారంలో మునిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు