logo

ఇందూరు అభివృద్ధికి అండగా ఉంటా

నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Published : 09 May 2024 04:57 IST

ఇంజినీరింగ్‌, మహిళా డిగ్రీ కళాశాలల బాధ్యత నాది
రోడ్‌ షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందూరుకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌, మహిళా డిగ్రీ కళాశాల, రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. నగరం స్మార్ట్‌ సిటీలో ఉండేలా చొరవ చూపుతానన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆర్మూర్‌లో పురపాలక సంఘం కార్యాలయ నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఛైర్‌పర్సన్‌ లావణ్య నా దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. ‘ఇవన్నీ చేసే బాధ్యత నాది.. మీరంతా 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డికి ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరారు.  

మచ్చలేని జీవన్‌రెడ్డిని గెలిపించండి..

‘వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తానని అప్పటి ఎంపీ కవిత మోసగించారు. 2019 ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు అని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ధర్మపురి అర్వింద్‌ మోసం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, రాంమాధవ్‌లతో ప్రకటన చేయించారు. ఆరు అడుగుల అహంకారమే అర్వింద్‌ అని, ఆయన నిర్లక్ష్యంతో నిజామాబాద్‌కు నిధులు రాకుండాపోయాయి.. ఆర్మూర్‌లో ప్రజలు భాజపా ఎమ్మెల్యేను గెలిపించి ప్రజలు పెనం పైనుంచి పోయిలో పడినట్లు అయింది. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైన నిధులు తెచ్చారా? అని ప్రశ్నించాలి. ఇప్పటి వరకు భారాస, భాజపాలను గెలిపించారు. ఈ సారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి. స్వయాన రైతు.. 40 ఏళ్ల ప్రజాజీవితంలో మచ్చలేని నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి. ఆయన్ని గెలిపించాలి. గెలిపించకుంటే.. మంచి ఓడిపోయి.. మోసమే గెలిచినట్లవుతుంది’..అని పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఆర్మూర్‌ ప్రాంత రైతులు 2021లో చేసిన ధర్నా తన ఎదుగుదలకు దోహదం చేసిందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి పాల్గొన్న ఆ ధర్నా సోనియమ్మ దృష్టిని ఆకర్షించడంతో తనకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించారని పేర్కొన్నారు. ఆ తర్వాత పోరాటాలతో పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని చూసి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని వెల్లడించారు. ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ,ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రోడ్‌ షోల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి మండవ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఏ.లలిత, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, గడుగు గంగాధర్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌ షోలు నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆర్మూర్‌లో అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..భాజపా, భారాసలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లక్ష ఓట్లతో గెలిపించాలి.. నేను లక్ష అంటా..మీరు పక్కా’ అనాలని సూచించి పలుమార్లు నినాదాలు చేయించారు. నిజామాబాద్‌లో గోల్‌ హనుమాన్‌ మందిరం కూడలి నుంచి నెహ్రూ పార్క్‌ వరకు ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని