logo

ప్రచార ఉపాధి

జెండాలు వేరైనా జిందాబాద్‌ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్‌షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు.

Published : 09 May 2024 05:05 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌

జెండాలు వేరైనా జిందాబాద్‌ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్‌షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు. ‘ఫలానా అభ్యర్థికి ఓటేయమ’ంటూ నినదిస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తల కంటే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచార కార్యక్రమాల్లో ముందుంటూ ఉపాధి పొందుతున్నారు.

అతివలే అధికం

రోడ్‌షోలు, కార్నర్‌ సమావేశాలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, పోల్‌ చీటీల పంపిణీ.. కార్యక్రమాల్లో ఎక్కువగా మహిళలే పాల్గొంటున్నారు. కొద్ది రోజులుగా ఎండలు మండుతుండటంతో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని పార్టీలు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నాయి. బూత్‌ల వారీగా నిధులతో పాటు ప్రచార సామగ్రి సమకూరుస్తున్నారు. ప్రతి బూత్‌ పరిధిలో స్వశక్తి సంఘాల ప్రతినిధుల ద్వారా మహిళలను ప్రచారానికి రప్పిస్తున్నారు. ఇంటింటి ప్రచారానికి ఉదయం, సాయంత్రం వేర్వేరుగా డబ్బులు చెల్లిస్తున్నారు.

ఇంటి ఖర్చులకు  పనికొస్తాయని..

ఒక్కోసారి ప్రచారానికి రూ.200 నుంచి రూ.300 చెల్లిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు మంగళహారతితో స్వాగతం పలికితే రూ.1500 నుంచి రూ.2 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక రోడ్‌షోలకు రూ.300, బహిరంగ సభలకు వెళ్తే రూ.400, వాహనంతో పాటు భోజనం, తాగునీటి వసతి, తిరిగి ఇళ్ల వద్దకు చేర్చడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇళ్లలో పని చేసుకునే మహిళలతో పాటు నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నందున వారి ఖర్చుల కోసం ఉపయోగపడతాయని, ఎండ పెరగకముందే వెళ్లి వస్తున్నా’మని మహిళలు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సాధారణంగా కొందరు ఉదయం ఒక పార్టీ తరఫున, సాయంత్రం మరో పార్టీకి మద్దతుగా ప్రచారానికి వెళ్తున్నట్లు వివరించారు.

సభలకు, ర్యాలీలకు పురుషులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అగ్ర నేతలు హాజరయ్యే బహిరంగ సభలకు మాత్రం పురుషులను తీసుకెళ్తున్నారు. బైక్‌ ర్యాలీలు వంటి వాటికి యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. వీరికి కూడా తగినంత చెల్లిస్తున్నారు. బైక్‌ ర్యాలీకి వెళ్లే వాహనాల్లో పెట్రోల్‌ కూడా ప్రచార బాధ్యులే పోయిస్తున్నారు. మొత్తం మీద ప్రచార ‘ఉపాధి’ ఈ నెల 11 వరకు కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని