logo

ప్రచారానికి 3 రోజులు.. పోలింగ్‌కు 5 రోజులు

లోక్‌సభ పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది. ఓ వైపు ప్రచారం తుది దశకు చేరుతుండటంతో నాయకులు వేగాన్ని పెంచుతుండగా ఎన్నికల యంత్రాంగం ఓటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలై ఉంది..

Updated : 09 May 2024 06:31 IST

వేగం పెంచుతున్న నాయకులు
ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు
ఈనాడు, కరీంనగర్‌

లోక్‌సభ పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది. ఓ వైపు ప్రచారం తుది దశకు చేరుతుండటంతో నాయకులు వేగాన్ని పెంచుతుండగా ఎన్నికల యంత్రాంగం ఓటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలై ఉంది.. ఓటింగ్‌ శాతం పెంచడంతోపాటు సజావుగా ప్రక్రియను ముగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయా విభాగాల నోడల్‌ అధికారులు వారికప్పగించిన పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు. ఈవీఎం యాదృచ్ఛికీకరణ సహా అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్‌ల ఏర్పాటు, వీవీ ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్లను అవసరమైన మేర తీసుకొచ్చి సిద్ధంగా ఉంచుతున్నారు. మరోవైపు అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఓట్ల వేటలో దూకుడును పెంచుతున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నేతల రాకతో జోష్‌..!

నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో మూడు ప్రధాన పార్టీల తరఫున రంగంలోకి దిగిన పార్టీల ముఖ్య నేతలు క్యాడర్‌లో జోష్‌ నింపారు. భారాస తరపున కేసీఆర్‌ ఇదే కరీంనగర్‌లో కదనభేరి పేరిట సభను నిర్వహించారు. తరువాత బస్సు యాత్ర ద్వారా రామగుండం, జగిత్యాలలో రోడ్‌షోలతో ఊపును పెంచారు. ఈ నెల 9న కరీంనగర్‌లో, 10న సిరిసిల్లలో కేసీఆర్‌ రోడ్‌షోలు మిగిలాయి. దాదాపుగా అన్ని పార్టీల ముఖ్యనేతలు కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఇక్కడి అభ్యర్థుల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావించారు. కాంగ్రెస్‌ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జమ్మికుంట, రాజారాంపల్లి, సిరిసిల్ల, కోరుట్లలో జరిగిన సభలకు విచ్చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచారు. కరీంనగర్‌లో ఈనెల 7న జరగాల్సిన సభ గాలివాన వల్ల రద్దవడంతో ప్రచారానికి చివరి రోజైన ఈనెల 11వ తేదీన భారీ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. భాజపా తరఫున నెల రోజుల కిందట జగిత్యాలకు ప్రధాని రాగా.. బుధవారం వేములవాడకు వచ్చారు. పెద్దపల్లికి భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా రాగా.. జమ్మికుంటకు అన్నామలై.. మంథనికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ విచ్చేశారు. మూడు ప్రధాన పార్టీల తరపున ముఖ్యనేతలు ప్రచారాన్ని సాగించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు.

సమస్యాత్మక కేంద్రాలపై..!

మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,852 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో సమస్యాత్మక కేంద్రాలుగా 1,466 గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికలతోపాటు గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ కేంద్రాల పరిధిలో జరిగిన అలజడులు, నమోదైన కేసుల విషయంలో ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షల్లో చర్చించారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని రకాల వసతులు ఉండే విధంగా చూస్తున్నారు. మండుటెండల్లో ఓటర్ల కేంద్రాలకు రావాల్సిన పరిస్థితి కావడంతో వారికి నీడ సదుపాయంతోపాటు తాగునీటి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ పూర్తయింది. ఆయా రూట్ల వారీగా ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించే ఏర్పాట్లు, పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించే దిశగా అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని