logo

పేలుడు కేసులో నిందితుడి అరెస్టు

బ్రూక్‌ఫీల్డ్‌ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్‌ షరీఫ్‌ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది.

Published : 29 Mar 2024 03:31 IST

శకలాల సేకరణలో ఎన్‌ఐఏ (పాతచిత్రం)

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బ్రూక్‌ఫీల్డ్‌ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్‌ షరీఫ్‌ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. ఇతనికి సహకరించిన అబ్దుల్‌ మతీన్‌ తాహా, మున్సవీర్‌ షాజిబ్‌ హుసేన్‌ల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ప్రధాన నిందితుడు పేలుడు పదార్థాలను సరఫరా చేసేవాడని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో పేలుడుకు ప్రణాళిక రూపొందించుకున్నాడని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులోని ఐదు చోట్ల, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక చోట ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కొందరు అనుమానితులు, ప్రధాన నిందితుడికి సహకారం అందించిన వారిని అదుపునకు తీసుకుని విచారణ కొనసాగించింది. కొందరి నివాసాల నుంచి నగదు, డిజిటల్‌ పరికరాలను ఎన్‌ఐఏ జప్తు చేసుకుంది.

మరో ఇద్దరి విచారణ:  బ్రూక్‌ఫీల్డులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించి మరో ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. పేలుడుకు కారకుడైన నిందితునితో వీరిద్దరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు దళం అధికారులు గుర్తించారు. అనుమానిత తీవ్రవాదులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్న వారిపై, టెలిఫోన్‌ సంభాషణలు, వాట్సప్‌ చాటింగ్‌ చేసిన వారిపై నిఘా ఉంచి, దర్యాప్తు కొనసాగించారు. ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్న వారిలో ఎక్కువ మంది నిషేధిత పీఎఫ్‌ఐ, ఇతర సంఘాల్లో క్రియాశీలక పాత్రను పోషించారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని