logo

గనినాడులో ప్రచార రాజసం

బళ్లారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్‌సభ అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్‌ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు.

Published : 05 May 2024 04:18 IST

బళ్లారిలో మైసూరు లోక్‌సభ అభ్యర్థి ప్రచారం

దళిత మహిళ దుర్గమ్మ నివాసంలో కొబ్బరి నీళ్లు తాగుతున్న భాజపా మైసూరు లోక్‌సభ అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త ఒడెయర్‌

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్‌సభ అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్‌ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం బళ్లారికి వచ్చిన ఒడెయర్‌కు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, హనుమంతప్ప, తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నగరంలోని గోనాళ్‌లోని దళిత మహిళ దుర్గమ్మ ఇంటికి వెళ్లారు. తొలుత ఒడెయర్‌ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళిత మహిళ దుర్గమ్మ ఆయనకు కొబ్బరి నీళ్లు ఇచ్చారు. అనంతరం యదువీర్‌ విలేకరులతో మాట్లాడారు. హంపీ విరూపాక్షేశ్వర దర్శనం కోసం పలుమార్లు హంపీకి వస్తుంటాను. పాఠశాల రోజుల్లో బళ్లారికీ చాలాసార్లు వచ్చాను. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున ఇక్కడి వచ్చానన్నారు. దళితుల ఇంట కొబ్బరి నీళ్లు తాగడం సంతోషంగా ఉందన్నారు. బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. మైసూరు మహారాజ కాలంలో రిజర్వేషన్లు తొలగించినట్లు తెలిపారు. నేను అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉంటాను. మన అందరం కన్నడిగులు, భారతీయులం.. ఐకమత్యంగా దేశాభివృధ్ధికి పాటుపడాలన్నారు. మైసూరుతో పాటు రాష్ట్రంలో 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందుతారన్న విశ్వాసం ఉందన్నారు. దళిత మహిళ దుర్గమ్మ మాట్లాడుతూ మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ మా ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు.  అనంతరం జైన్‌ మార్కెట్‌లోని రాజస్థానీ సముదాయ ప్రజలతో ఒడెయర్‌ సమావేశం నిర్వహించారు.

‘ఈ ఎన్నికలు రాహుల్‌గాంధీ మనుగడకే’

హొసపేటె: రాహుల్‌ గాంధీ మనుగడ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. వారికి యువరాజు సంక్షేమం తప్పితే, దేశ సంక్షేమం పట్టదని భారతీయ జనతాపార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి తేజస్వీ సూర్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన యువసంకల్ప సమావేశాన్ని మైసూరు రాజు యదువీర్‌ ఒడెయార్‌తో కలిసి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. మరో ఐదేళ్లలో రాహుల్‌గాంధీ సీనియర్‌ సిటిజన్‌గా మారుతారు. అసలే రాజకీయ అనుభవంలేని ఆయన్ను ప్రధాని చేయటానికి నాయకులు, కార్యకర్తలు ఉబలాటపడటం ఆశ్చర్యంగా ఉందని వ్యంగమాడారు.  మైసూరు రాజు యదువీర్‌ ఒడెయార్‌ మాట్లాడుతూ..మన ధర్మ, సంస్కృతి, వారసత్వాలు కలకాలం ఉండాలంటే అది భాజపాతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో హడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్‌, జిల్లాధ్యక్షుడు చెన్నబసవనగౌడ, యువమోర్చ రాష్ట్ర కోశాధ్యక్షుడు సిద్ధార్థసింగ్‌, జిల్లాధ్యక్షుడు కిచిడి కొట్రేశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని