logo

కలబురగి.. కదనరంగమే

పేరుకు- కర్ణాటకలోని కలబురగిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాధాకృష్ణ దొడ్డమని, భాజపా తరఫున డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ పోటీ పడుతున్నా.. వీరి గెలుపోటములు జాతీయ స్థాయిలో ఇద్దరు ఉద్దండుల ప్రతిష్ఠతో ముడిపడింది.

Published : 05 May 2024 04:34 IST

ఉద్దండుల ప్రతిష్ఠకు వేదిక

మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్ర మోదీ, రాధాకృష్ణ దొడ్డమని, డా.ఉమేశ్‌ జాదవ్‌

ఈనాడు, బెంగళూరు : పేరుకు- కర్ణాటకలోని కలబురగిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాధాకృష్ణ దొడ్డమని, భాజపా తరఫున డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ పోటీ పడుతున్నా.. వీరి గెలుపోటములు జాతీయ స్థాయిలో ఇద్దరు ఉద్దండుల ప్రతిష్ఠతో ముడిపడింది. భాజపా నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ.. మరోవైపు ఇండియా కూటమిలో ప్రస్తుతానికి తెరపైకి కనిపించే ప్రధాని అభ్యర్థి మల్లికార్జున ఖర్గే. ఈ ఎన్నికల్లోనే కాదు పార్లమెంట్‌ ఆవరణలోనూ భాజపా విధానాలను, మోదీ పాలనను అధికారికంగా విమర్శించే నేత ఖర్గే. వీరిద్దరికీ కర్ణాటకలోని కలబురగి స్థానం ఓ ప్రతిష్ఠగా మారింది. వీరిద్దరూ కలబురగిలో పోటీ చేయకపోయినా- అభ్యర్థుల గెలుపోటములు వీరి ఆధిపత్యానికి గీటురాయిగా మారతాయనటంలో అతిశయోక్తి లేదు. ఆ కారణంగానే ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రచారానికి కలబురగి నుంచే ప్రారంభించి ఈ చోటు ప్రాధాన్యం గుర్తు చేశారు. మరోవైపు మల్లికార్జున ఖర్గే సైతం ఇక్కడే ప్రచారానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం చెమటోడుస్తున్నారు.

కాంగ్రెస్‌ కంచుకోట

కన్నడనాట మూడో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన కలబురగిలో 1952 నుంచి 18 సార్లు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్‌ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. 2009 వరకు జనరల్‌ కేటగిరీగా గుర్తించిన ఈ స్థానాన్ని అనంతరం ఎస్‌సీగా రిజర్వు చేశారు. కేటగిరీ మార్చినా ఇది కాంగ్రెస్‌కు పెట్టని కోటగానే మారింది. దళిత సముదాయానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు కలబురగి తిరుగులేని విజయాలను అందించింది. అప్పటికే ఈ జిల్లాలోని గురుమిత్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి తొమ్మిది సార్లు నిరాటంకంగా గెలుస్తూ వచ్చిన ఖర్గే 2009లో లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ తర్వాత లోక్‌సభకు పోటీ పడ్డారు. 2009, 2014ల్లో ఖర్గే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ వరుస విజయాలతో సోలిల్లద సరదార్‌ (ఓటమి లేని సర్దార్‌)గా అటు అభిమానులు, ఇటు పార్టీలో పిలిపించుకునే ఖర్గేకు 2019 ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి. దేశమంతా మోదీ ప్రభావానికి లోనైనట్లే కలబురగి సైతం కాంగ్రెస్‌ నుంచి పట్టుజారి పోయింది. ఖర్గే తన జీవితంలో తొలి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడిన మూడు సందర్భాల్లో రెండు సార్లు భాజపా అభ్యర్థులు గెలవగా అందులో 2019 ఎన్నికలు కూడా ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వలేదని భాజపాలోనికి చేరిన కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ ఉమేశ్‌జాదవ్‌ 2019లో ఏకంగా ఖర్గేతో పోటీ చేసి గెలవటం ఓ చరిత్ర.

పార్టీలకూ కీలకమే..

ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి రాధాకృష్ణ దొడ్డమని, భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ పోటీ పడుతున్నారు. 2019లో ఈ స్థానంలో ఓటమి చెందినా కాంగ్రెస్‌ పార్టీ ఖర్గే సేవలను మరింత విస్తరించింది. అప్పటికే లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న ఖర్గేను ఈసారి రాజ్యసభకు నామినేట్‌ చేసి 2021లో రాజ్యసభలో విపక్ష నేతను చేసింది. ఆపై ఏఐసీసీ అధ్యక్ష పదవినీ కట్టబెట్టింది. రాజ్యసభ పదవీ కాలం ఇంకా రెండేళ్లుండటం, ఏఐసీసీ పదవీ బాధ్యతల కారణంగా ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. చివరి నిమిషం వరకు ఖర్గే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేసినా చివరకు ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో.. దొడ్డమనికి ఓటేస్తే నాకు ఓటేసినట్లేనని ఖర్గే ప్రకటించటంతో రాష్ట్ర కార్యవర్గం ఈ స్థానంలో ఎన్నికలను సవాలుగా తీసుకున్నాయి.

పెద్దల ప్రచారం

కేవలం ఈ ఎన్నికల్లోనే కాదు 2023 విధానసభ ఎన్నికల సమయంలోనే ప్రధాని మోదీ ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం. మోదీతో పాటు భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు ఈ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు ఎంతగానో శ్రమించారని మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రచారంలో వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల సమయంలో మోదీ ఇక్కడ ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీలో ఖర్గేకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ఆయన కుటుంబ పార్టీలో ఓ దిక్కులేని నేతగా ఎద్దేవా చేసేవారు. ఆయన ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమిలో ఏ నేత కూడా బహిరంగగా ఆమోదించే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు. విధానసభ ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల్లో ఆరుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించడం విశేషం. ఈసారి కలబురగి కాంగ్రెస్‌కు దక్కనీయకుండా భాజపా నేతలు గట్టి ప్రచారాన్ని సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ఈ స్థానంలో ప్రచారాన్ని ముగించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడితే అది జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వం ఓటమిగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తుంటాయి. భాజపా సైతం సొంత జిల్లాలో గెలవలేని నేత జాతీయ స్థాయిలో పార్టీని ఎలా నడిపించగడని ఖర్గేపై విమర్శించే అవకాశం లేకపోలేదు.

ఖర్గే భావోద్వేగం

ఇటీవల కలబురగిలో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఖర్గే భావోద్వేగానికి లోనవటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయారంటే ఈ స్థానంలో నాకు చోటే లేనట్లే. మీ హృదయంలోనూ నాకు స్థానం లేనట్లే. చివరిగా.. ఈ జిల్లాను ఎంతో కొంత అభివృద్ధి చేశానన్న అభిమానం ఉంటే నా అంతిమ సంస్కారానికైనా రావాలి’ అని ఓటర్లను అభ్యర్థించటంతో ఖర్గే ఈ స్థానంలో గెలుపు కోసం ఎంత ఆరాటపడుతున్నారో అర్థమవుతోంది.

ప్రభావిత అంశాలు

  • ఎంత కాదన్నా వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన కలబురగికి ప్రగతి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. అందులోనే ఖర్గే పాత్ర కీలకం. ‘కల్యాణ కర్ణాటక’ ప్రాంతంలో ఒకటైన ఈ ప్రాంతానికి 371 హోదా కల్పించటం, ఈ పదేళ్లలో 10 వేల మందికి వైద్య సీట్లు, లక్ష మందికి ఇంజినీరింగ్‌ సీట్లు దక్కాయి. ఈఎస్‌ఐసీ ఆస్పత్రి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైకోర్టు కలబురగి ధర్మాసనం వంటి పనులు కాంగ్రెస్‌ ద్వారా సాధ్యమయ్యాయి. భాజపా ఐదేళ్లలో జౌళి పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి, కలబురగి నుంచి బెంగళూరుకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సదుపాయాలు కల్పించినా సిట్టింగ్‌ ఎంపీ అంతగా అభివృద్ధి వైపు దృష్టి సారించలేదన్న ఆరోపణ వినిపిస్తోంది.

కలబురగి ముఖచిత్రం

  • అభ్యర్థులు: రాధాకృష్ణ దొడ్డమని(కాంగ్రెస్‌), డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌(భాజపా)
  • మొత్తం ఓటర్లు: 20,35,806, పురుషులు-10,34,376, మహిళలు-10,31,157, ఇతరులు-273.

పూర్వ ఎన్నికల ఫలితాలు

  • 2019: విజేత-డా.ఉమేశ్‌జాదవ్‌(భాజపా), సమీప ప్రత్యర్థి-మల్లికార్జున ఖర్గే(కాంగ్రెస్‌).
  • 2014: విజేత-మల్లికార్జున ఖర్గే(కాంగ్రెస్‌), సమీప ప్రత్యర్థి-రేవూనాయక్‌(భాజపా)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని