logo

చెంప చెళ్లుమనిపించిన డీకే

హుబ్బళ్లి కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు.

Published : 06 May 2024 05:22 IST

హావేరి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. ఆయన కారులో నుంచి కిందకు దిగుతున్న డీకేపై స్థానిక పురసభ సభ్యుడు అల్లావుద్దీన్‌ మనియార్‌ చేయి వేశారు. కోపగించుకున్న ఉప ముఖ్యమంత్రి ఆయన చెంప చెళ్లుమనిపించి పక్కకు తోశారు. ఈ వీడియోను భాజపా నాయకుడు అమిత్‌ మాళవీయ తన సామాజిక మాధ్యమం ఖాతాలో వైరల్‌ చేయడంతో చర్చగా మారింది.


కలబురగి మాదే..

కలబురగి, న్యూస్‌టుడే : కలబురగి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే డాక్టర్‌ అజయ్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీ పథకాలే ఓట్లు తీసుకువస్తాయన్న నమ్మకం ఉందన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలబురగి విభాగంలో పలు అభివృద్ధి పనులు జోరందుకున్నాయని తెలిపారు.


ఒక అంకె.. దాటదు

బీదర్‌, న్యూస్‌టుడే : గత ఎన్నికల్లో పాతిక సీట్లు గెల్చుకున్న భాజపా ఇప్పుడు ఒక అంకె దాటదని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి జోస్యం చెప్పారు. తాము 28 స్థానాలు గెలుస్తామని భాజపా ప్రకటించుకోవడం మేకపోతు గాంభీర్యమేనని అన్నారు. ఆయన బీదర్‌లో ఆదివారం విలేకరులతో  మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చినప్పుడే మోదీ, షాలకు కర్ణాటక గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకకు అన్యాయం జరిగిన ప్రతిసారీ ఇక్కడి నుంచి గెల్చిన ఎంపీలు పార్లమెంటులో గళం విప్పడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. దేశంలో ప్రధానులు అందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే పదేళ్లలో రూ.130 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.


నాదే విజయం: ఈశ్వరప్ప

శివమొగ్గ, న్యూస్‌టుడే : శివమొగ్గలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం చేసి వెళ్లినప్పటికీ నా విజయావకాశాలు క్షీణించవని భాజపా తిరుగుబాటు అభ్యర్థి కేఎస్‌ ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్‌, భాజపా మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన కుమారునికి టికెట్‌ రాకుండా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబమే అడ్డుకుందన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారంలో ఓటర్ల నుంచి చక్కని స్పందన లభించిందన్నారు.


అచ్ఛేదిన్‌ అంటే..

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : అచ్ఛేదిన్‌ అంటే దుబారీ, మోదీ అంటే మఖ్మల్‌ టోపీ అని కర్ణాటక కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. గత పదేళ్లలో పెరిగిన ధరల గ్రాఫుతో తన ఎక్స్‌కార్ప్‌ ఖాతాలో ఆయా వస్తువుల ధరలను పేర్కొంటూ భాజపా తీరును తూర్పారబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని