logo

రాజకీయ ‘మహాసంగ్రామం’

అభ్యర్థుల తరఫున మలివిడత ప్రచారాన్ని ముగించిన పార్టీలు.. ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి.

Updated : 06 May 2024 06:57 IST

ముగిసిన మలివిడత ప్రచారం
ఓటర్ల తీర్పు కోసం ఎదురుచూపు

భాజపా అభ్యర్థుల తరఫున హోరెత్తిన మోదీ ప్రచారం

ఈనాడు, బెంగళూరు : అభ్యర్థుల తరఫున మలివిడత ప్రచారాన్ని ముగించిన పార్టీలు.. ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల బహిరంగ ప్రచారానికి తెరపడటంతో సోమవారం ఇంటింటా ప్రచారానికి అభ్యర్థులు, పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. మంగళవారం నిర్వహించే పోలింగ్‌ కార్యక్రమంలో తమకెన్ని ఓట్లు పడతాయోనని అభ్యర్థులు, వారికి టికెట్లిచ్చిన పార్టీలు లెక్కలేస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ ప్రాంతంలోని 14 నియోజవర్గాల ఎన్నికలు ముగిసినా.. మలివిడత ఎన్నికల్లో స్థానిక సమస్యలు, పార్టీల ప్రచారాంశాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. అన్ని పార్టీలూ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసి, అమలు చేశాయి. ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలు ప్రచార బాధ్యతలు తీసుకుని వాటిని సజావుగా అమలు చేశారు.

మల్లికార్జున ఖర్గేకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం, ‘చెంబు’ ప్రచారంతో ఆకట్టుకున్న రాహుల్‌గాంధీ

ఎవరి లెక్కలు వారివే

దక్షిణ ప్రాంతంలోని 14 నియోజకవర్గాల్లో 11, ఉత్తర ప్రాంతంలోని మొత్తం 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో గెలుచుకున్న భాజపా.. ఈ ఎన్నికల్లో ఇదే స్థాయి ఫలితాలను ఆశిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా ఈస్థాయి విజయం దక్కదన్న కాస్త భయంతో జేడీఎస్‌తో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంది. వీరి పొత్తు తొలివిడత ఎన్నికల్లో ఫలితాలు అందించే అవకాశం ఉన్నా వీరి ఆశలపై ‘ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు’ గండికొట్టే ప్రమాదం లేకపోలేదు. తొలివిడత ఎన్నికలకు ముందే ఈ కేసు తాలూకు వీడియోలు హాసన జిల్లా మొత్తం వైరల్‌ అవగా అతను పోటీ చేస్తున్న హాసనలోనే కాదు ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే మండ్య, కోలారుల్లో, వీరు మద్దతిస్తున్న బెంగళూరు గ్రామీణ, మైసూరు, తుమకూరు, చిక్కబళ్లాపుర తదితర ప్రాంతాల్లోనూ ప్రభావం పడనుందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ కేసు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో భాజపా ప్రతిష్ఠకు భంగం కల్గించే స్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రాంతంలో ఎన్నికల రోజుకు ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చకు దారితీయటంతో భాజపా అప్రమత్తమైంది. ఏకంగా ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా లపై కాంగ్రెస్‌ ఆరోపిస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రజ్వల్‌పై కఠినంగా ప్రవర్తించటం ప్రారంభించారు. ప్రజ్వల్‌ ఈ ఎన్నికల్లో గెలిస్తే అతనిని ఎన్‌డీఏ అభ్యర్థిగా పరిగణించబోమని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ప్రకటించారు. మరోవైపు ప్రజ్వల్‌ను తక్షణమే బంధించకపోవటం, కాంగ్రెస్‌, జేడీఎస్‌ సర్కారు సమయంలోనే ఈ ఆరోపణలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఈ ఎన్నికల్లో భాజపాకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడుతున్నారు. మొత్తంగా మలివిడత ఎన్నికల్లో ‘ప్రజ్వల్‌ అంశం’ భాజపాకు గుబులు పుట్టిస్తున్నా వారికి ప్రధాని మోదీ నాయకత్వంపై ఆశలు ఎక్కువ!

అదును చూసి అస్త్రం

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి రేవణ్ణ అంశాన్ని అదునుచూసి రాజకీయ అస్త్రంగా మలుచుకుంది. తొలివిడత ఎన్నికల్లో ఒక్కలిగ ఓటర్ల నుంచి ప్రమాదం తప్పదని భావించిన పార్టీ రెండో విడత ఎన్నికల సమయానికి కేసును రాకెట్‌లా ప్రయోగించారు. రోజుల వ్యవధిలోనే సిట్‌ను ఏర్పాటు చేయటం, నోటీసులపై నోటీసులు పంపటం, రేవణ్ణను బంధించటం వంటి చర్యలు పోలీసుల నేతృత్వంలో జరిగినా వాటి వెనుక రాజకీయ హస్తం ఉందన్న వాదన వినిపిస్తోంది.. ఈ కేసు వెనుక అదృశ్య హస్తాల మాట అలా ఉంచితే కాంగ్రెస్‌కు ఈ కేసు ఓ రాజకీయ మైలేజ్‌గా మారిందనటంలో అతిశయోక్తి లేదు. మరోవైపు రాజకీయ పరంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో ఈ అంశంపై పదునైన విమర్శలు చేయించటం, వాటిపై సామాజిక వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేయటంలో కాంగ్రెస్‌ సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఉత్తర ప్రాంత స్థానాలకు బాధ్యత అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా అభ్యర్థుల తరఫున గట్టిగానే ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా పొందని కాంగ్రెస్‌ ఈ సారి కనీసం సగం సీట్లయినా కొల్లగొట్టాలని ఎత్తుగడలు వేస్తోంది.

దళపతులకు షాక్‌

ఎన్‌డీఏ అండతో ఈ ఎన్నికల్లో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నించిన దళపతులు- ప్రజ్వల్‌ పుణ్యమా అని కుదేలయ్యారు. అసలే విధానసభ ఎన్నికల్లో కనీసం 20 స్థానాలు కూడా పొందలేని జేడీఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలోనే స్థానాలు సాధించి పోటీ చేసింది. పార్టీ అధినేత హెచ్‌.డి.దేవేగౌడ నేతృత్వంలో తొలివిడత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయగలిగిన పార్టీ శ్రేణులు మలివిడతలో డీలా పడిపోయారు. ప్రజ్వల్‌ కేసు తర్వాత భాజపా వీరిని దూరంగా పెట్టే ప్రయత్నం చేసింది. కేవలం కుమారస్వామి మాత్రమే అప్పుడప్పుడు విలేకరుల సమావేశంలో కనిపించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించినా.. ఆ సమావేశాలకు భాజపా నేతలెవ్వరూ హాజరుకాలేదు. రెండో విడత ఎన్నికల సమయంలో కనీసం బయట అడుగుపెట్టని హెచ్‌.డి.దేవేగౌడ కుమారుడు, మనవడి వ్యవహారాలతో మంచానపడ్డారు. అసలే ఆరోగ్యం సహకరించని ఆయన ఈ కేసుల గోలతో మరింత అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. బెయిల్‌ దొరకని రేవణ్ణను పోలీసులు దేవేగౌడ నివాసంలోనే అరెస్ట్‌ చేయటంతో ఆ పార్టీకున్న గౌరవానికి జాతీయ స్థాయిలో మచ్చపడిందంటూ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం కుమారస్వామి, దేవేగౌడలను మరింత కలచి వేస్తోంది.  శనివారం రాత్రి బెంగళూరులోనే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కేసుపై చర్చించేందుకు కుమారస్వామి యత్నించినా కేవలం మొక్కుబడి భేటీకే ఆయన అనుమతించారని సమాచారం. మొత్తంగా ఈ లోక్‌సభ ఎన్నికలు ఎన్‌డీఏలో ప్రధాన పార్టీ భాజపాకు, భాగస్వామి జేడీఎస్‌కు ప్రజ్వల్‌ రూపంలో సవాలు విసిరినట్లే.

సిద్ధు ప్రచారం మాటేంటి?

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ రేవణ్ణకు మద్దతుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచారం చేశారని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. యువకుడైన ప్రజ్వల్‌ చక్కని సేవలు అందిస్తారు. ఆయనన్ను గెలిపించాలని తన ఎక్స్‌ కార్ప్‌ ఖాతాలో సిద్ధరామయ్య అప్పట్లో రాసుకున్నారని గుర్తు చేశారు. ఆయన బెంగళూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కడూరు ఏపీఎంసీ మైదానంలో ప్రజ్వల్‌ను పక్కన కూర్చోబెట్టుకుని ప్రచారాన్ని చేశారని గుర్తుచేశారు. ఇప్పటి ఎన్నికల్లో ప్రజ్వల్‌ ఇంకా విజయం సాధించలేదన్నారు. గెలిస్తే ఆయన దళ్‌ సభ్యునిగా ఉంటారా? ఎన్‌డీఏలో భాగస్వామా? అనే అంశాన్ని భాజపా హైకమాండ్‌ తీర్మానిస్తుందన్నారు.

అది అప్రస్తుతం..

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఉన్న అశ్లీల వీడియోలను ఎవరు విడుదల చేశారన్నది అప్రస్తుతమని కేంద్ర మంత్రి, ధార్వాడ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. ప్రజ్వల్‌పై పలువురు మహిళలు ఫిర్యాదు చేశారని, పెన్‌డ్రైవ్‌ల్లో ఉన్న వీడియోలు బయట పడిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి విచారించడంలో తప్పేమీ లేదన్నారు. ప్రభుత్వం, సిట్ దీనికి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటోందని తెలిపారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్‌ జోక్యం చేసుకుని, బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సూచనలు చేసిందని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని