logo

Khammam: వరుడు ఒక్కరే.. వధువులు ఇద్దరు..!

పెళ్లి కొడుకు ఒకరే.. వధువులు మాత్రం ఇద్దరు.. ఓకే ముహూర్తాన ఆ ముగ్గురూ ఒక్కటవబోతున్నారు.

Updated : 09 Mar 2023 15:44 IST

చర్ల, న్యూస్‌టుడే: పెళ్లి కొడుకు ఒకరే.. వధువులు మాత్రం ఇద్దరు.. ఓకే ముహూర్తాన ఆ ముగ్గురూ ఒక్కటవబోతున్నారు. ఒకే పెళ్లి మండపంపై ఇద్దరు వధువులను ఓ గిరిజన యువకుడు గురువారం పెళ్లాడబోతున్నాడు. ఇప్పటికే పెళ్లి పత్రికలను కొట్టించి బంధువులకు పంచేశారు. ఈ శుభలేఖ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడేళ్ల కిందట ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇంటికి తెచ్చుకున్న అతగాడు ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో వారిని గిరిజన సంప్రదాయంతో వివాహం చేసుకోబోతున్నాడు.

* చర్ల మండలం మారుమూల ఎర్రబోరుకు చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదివి ఆపేశాడు. ఇదే మండలం దోశిల్లపల్లికి చెందిన స్వప్న కుమారిని ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో ప్రేమించాడు. అదే క్రమంలో వరుసకు మరదలైన కుర్నపల్లికి చెందిన సునీతను సైతం ఇష్టపడ్డాడు. అనంతరం మూడేళ్లుగా ఇద్దరితో సహజీవనం సాగించాడు. ఈ క్రమంలో స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమని కోరగా.. ఇద్దరినీ అమితంగా ప్రేమించానని.. ఇద్దరినీ పెళ్లాడతానని ఇరుపక్షాల దగ్గరా ఒప్పించుకున్నాడు. మూడు గ్రామాల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీ ద్వారా ముగ్గురి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఇష్టప్రకారమే పెళ్లికి నిశ్చయించారు. ఈ నేపధ్యంలో వరుడు ఇంటి వద్ద ఎర్రబోరులో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.

* అందరితో పోల్చితే గిరిజన సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి.. కొన్నిచోట్ల యువతీ యువకులు ఇష్టపడితే ముందుగా ఇంటికి తెచ్చుకుంటారు. వారితో సహజీవనం సాగిస్తారు. కాగా ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించారు. గురువారం ఉదయం అర్చకులు లేకుండా పెద్దల సాక్షిగా ఇద్దరు వధువులను సత్తిబాబు మనువాడ బోతున్నాడు. ఈ ముగ్గురి ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతోందని గ్రామస్థులు తెలిపారు.

* ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’తో సీఐ అశోక్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ అంశంపై సమాచారం అందలేదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని