logo

వనమాకు ఝలక్‌..!

శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. కొత్తగూడెం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్టింగ్‌ సీటు తనకే దక్కుతుందంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమాతో ఉండగా..

Updated : 26 Jul 2023 07:48 IST

ఈటీవీ - ఖమ్మం : శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. కొత్తగూడెం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్టింగ్‌ సీటు తనకే దక్కుతుందంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమాతో ఉండగా.. భారాస అధిష్ఠానం తనవైపే మొగ్గు చూపుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు మంగళవారం ఇచ్చిన సంచలన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచిన వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసి.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలన్న జలగం వెంకట్రావు అభ్యర్థనను హైకోర్టు అంగీకరించి వనమాను అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా 2018 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నట్లు తీర్పు ఇవ్వటంతో సరికొత్త రాజకీయాలకు కొత్తగూడెం  నియోజకవర్గం వేదిక కాబోతోంది.

వెంకట్రావుకు ఊరట..

హైకోర్టు తీర్పుతో కొత్తగూడెంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీర్పుతో వనమా వెంకటేశ్వరరావుకు గట్టి ఎదురుదెబ్బ తగలగా జలగం వెంకట్రావుకు ఊరట దక్కింది. తెరాస నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు.. ఓటమి తర్వాతా అదే పార్టీ (ప్రస్తుత భారాస)లో కొనసాగుతూ వస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుచరులు, కార్యకర్తలను తరచూ కలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ సీటు ఇస్తామని భారాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఇద్దరు నేతలూ ప్రస్తుతం భారాసలోనే ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం ఎవరి అభ్యర్థిత్వంపై మొగ్గుచూపుతుందన్న అంశంపై అధికార పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. హైకోర్టు తీర్పుతో కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వర్గీయులు, భారాస కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పుపై వనమా వర్గీయులు, భారాస ముఖ్యనాయకులు కొత్తగూడెంలో సమావేశమై సమాలోచనలు జరిపారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేద్దామని చెప్పారు.

ఇదీ నేపథ్యం..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా జలగం వెంకట్రావు బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. వనమాకు 81,118 ఓట్లు, వెంకట్రావుకు 76,979 ఓట్లు దక్కాయి. జలగంపై 4,139 మెజారిటీతో వనమా గెలుపొందారు. రెండో స్థానంలో జలగం నిలిచారు. ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే 2019 జనవరిలో హైకోర్టును వెంకట్రావు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు సమాచారమిచ్చారని.. కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా జలగం వెంకట్రావు న్యాయపోరాటం ఆపలేదు. 2019 మార్చి 18న జలగం పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. అప్పటి నుంచి వాద, ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నా తుది తీర్పు రాకపోవడంతో జలగం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని త్వరితగతిన తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వరావును ఎమ్మెల్యేగా అనర్హుడిగా తేల్చుతూ రెండోస్థానంలో ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని