logo

Kothagudem: ‘గూడెం’ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు.. కలుస్తున్న భిన్నధ్రువాలు..!

పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ‘గూడెం’ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated : 17 Nov 2023 07:32 IST

జలగం వెంకట్రావు, ఊకంటి గోపాలరావు రహస్య భేటీ

ఊకంటి గోపాల్‌రావు

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ‘గూడెం’ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాశ్వత శత్రువులు మిత్రులుగా.. మిత్రులు సైతం శత్రువులుగా మారుతున్న వైనం వేడి పుట్టిస్తోంది. మొన్నటి వరకు భిన్న ధ్రువాలుగా మెలిగిన వారు ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు మరో ఉదాహరణ. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావుతో జట్టు కట్టేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు ఊకంటి గోపాలరావు సుముఖత వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఓ నివాసంలో వారిద్దరూ భేటీ అయ్యారు.

వీరు 2014 ఎన్నికల వరకు మంచి స్నేహితులు. ఆ తర్వాత విభేదాలు తలెత్తటంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. విభేదాలన్నీ మరిచి ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా శాయశక్తులా ప్రయత్నిస్తానని వెంకట్రావుకు ఊకంటి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. పాల్వంచ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇద్దరూ కలిసి శుక్రవారం ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు సైతం భేటీకి హాజరైనట్లు తెలిసింది. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై పట్టున్న నాయకుడిగా గోపాలరావుకు పేరుంది. ఆయన 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం విజయం సాధించేందుకు తోడ్పాటు అందించారు. 2018లో ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దగ్గరయ్యారు. ఈ ఎన్నికల్లో హస్తం నుంచి ‘గూడెం’ టికెట్‌ ఆశించిన వారిలో ఊకంటి ఒకరు. సుమారు 15 ఏళ్ల వైరానికి స్వస్తి పలికిన తోడల్లుళ్లు.. కాంగ్రెస్‌ నేత ఎడవల్లి కృష్ణ, భారాస అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఒక్కటైన కొద్దిరోజులకే ఊకంటి.. జలగం రహస్యంగా భేటీ కావటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని