logo

ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పాటుకు కృషి: తాండ్ర

అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు.

Published : 28 Mar 2024 01:51 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, చిత్రంలో సత్యనారాయణ తదితరులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. ఖమ్మంలో విలేకర్ల సమావేశంలో బుధవారం మాట్లాడారు. రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ప్రజలు విజ్ఞులని, మోదీ మూడోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే ఖమ్మంలో కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తనను పార్లమెంట్‌కు పంపితే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి యత్నిస్తానని, కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలున్నాయని, భద్రాచలం పరిసరాల్లో రామాయణంతో ముడిపడిన ప్రదేశాలను కలుపుకొని అయోధ్యతో కలుపుతూ ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పాటు చేయటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, గో ఆధారిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం, జిల్లాలో ఎన్‌టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మంజూరు చేయిస్తానని చెప్పారు. కొత్తగూడెంలో ఎన్‌ఎండీసీకి చెందిన 600 ఎకరాల ఖాళీ భూమి ఉందని, అందులో మైనింగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో ఉపరితల బొగ్గు గనుల తవ్వకం వల్ల ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కొత్తగా గృహాలు మంజూరు చేయిస్తామని వివరించారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్పొరేటర్‌ దొంగల సత్యనారాయణ, రామలింగేశ్వరరావు, నున్నా  రవికుమార్‌, వెంకటేశ్వరరావు, అంజయ్య, సరస్వతి, కోటేశ్వరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని పలువురు భారాస నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. వీరికి వినోద్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని