logo

పిండం దశలోనే పిసికేస్తున్నారు!

ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు.

Published : 29 Mar 2024 02:22 IST

అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రి సీజ్‌

ఖమ్మం వైద్యవిభాగం: ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. ఖమ్మంలో శిక్షణ ఐఏఎస్‌ యువరాజ్‌, శిక్షణ ఐపీఎస్‌ మౌనికతో కలిసి డీఎంహెచ్‌ఓ మాలతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, ఔషధ నియంత్రణ విభాగం ఏడీ ప్రసాద్‌ చర్చిరోడ్డులోని సుగుణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమ చికిత్సలపై సమాచారమందడంతో తనిఖీలు చేశారు. యువతులు, వివాహితలకు అబార్షన్లు చేస్తున్నట్లు నిర్ధారించారు. రిజిస్టర్లలో రోగుల పేర్లు నమోదు చేయకుండా ఇన్‌ పేషెంట్లుగా చేర్చుకున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వచ్చిన గర్భిణులకు ఇక్కడ అబార్షన్లు చేసినట్లు కేసుషీట్లలో గుర్తించారు. కడుపునొప్పి, కుటుంబ నియంత్రణ తదితర చికిత్సల పేరుతో రోగులను ఆస్పత్రిలో చేర్చుకొని అనైతిక వైద్యం చేస్తున్నారు. ఆస్పత్రిలోనే స్కానింగ్‌ చేసి గర్భంలో ఆడపిల్ల ఉందని తేలితే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. తనిఖీల్లో దాదాపు 50 మందికి అబార్షన్లు చేసినట్లు వైద్యాధికారులు తేల్చారు. గురువారం ఒక్కరోజే ఐదుగురికి చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అనుమతులు లేకుండా సంబంధిత ఔషధాలను అనుబంధ ఫార్మసీలో విక్రయిస్తున్నారు. తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఆస్పత్రిని సీజ్‌చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. చికిత్స కోసం ఇక్కడ చేరిన ముగ్గురు గర్భిణులను సర్వజనాసుపత్రికి తరలించామన్నారు. సుగుణ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని