logo

కదన కుతూహలం

సార్వత్రిక సమరంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమవుతోంది. నామినేషన్ల స్వీకరణ క్రతువు గురువారం మొదలుకానుంది. నామపత్రాల దాఖలుతో పాటు ప్రచార జోరు పెంచేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

Published : 16 Apr 2024 02:13 IST

ఈటీవీ, ఖమ్మం: సార్వత్రిక సమరంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమవుతోంది. నామినేషన్ల స్వీకరణ క్రతువు గురువారం మొదలుకానుంది. నామపత్రాల దాఖలుతో పాటు ప్రచార జోరు పెంచేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఈసారి త్రిముఖ పోరు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, భారాస, భాజపా  నాయకులు ఎవరికివారు ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటంతో లోక్‌సభ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.


సమరోత్సాహంతో కాంగ్రెస్‌

నాలుగు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోరు మీదున్న కాంగ్రెస్‌.. సార్వత్రిక సమరంలోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం ఎన్నికల ఇన్‌ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ స్థానం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను చుట్టేస్తూ కార్యకర్తలను ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. జిల్లా నాయకత్వం మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. అభ్యర్థి ఖరారయ్యాక ప్రచారాన్ని ఉరకలెత్తించేందుకు హస్తం పార్టీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఇన్‌ఛార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ ప్రచార జోరు క్రమంగా జోరందుకుంటోంది. అభ్యర్థి బలరాంనాయక్‌తో పాటు మంత్రులు తుమ్మల, సీతక్క ప్రచారం మొదలుపెట్టారు.
బలరాంనాయక్‌ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు.


ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా భారాస

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలుచేస్తామని శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నమ్మించిందని, ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందంటూ ప్రజల్లోకి భారాస వెళ్తోంది. శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు ఈనెల 24న నామపత్రాలు దాఖలు చేయనున్నారు. మహబూబాబాద్‌ స్థానంలో భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత ప్రచారం మొదలుపెట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రచార పర్వంలో దూకారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో భారాస నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల హస్తం గూటికి చేరటం గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.


మోదీ చరిష్మాతో భాజపా

కేంద్రంలో పదేళ్ల పాలన, ప్రధాని మోదీ చరిష్మాతో భాజపా ప్రచారం ప్రారంభించింది. మోదీ పాలనపై రూపొందించిన కరపత్రాలను అందిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి తాండ్ర  వినోద్‌రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలోనూ భాజపా అభ్యర్థి సీతారాంనాయక్‌ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా రాష్ట్రస్థాయి ముఖ్య నేతలతో కలిసి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని