logo

గంజాయి పేరెత్తకుండా

ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం.

Published : 25 Apr 2024 02:54 IST

గంజాయిని దహనం చేస్తున్న పోలీసులు

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. కొందరు విద్యార్థులు సైతం పోలీసులకు పట్టుబడుతున్నారు. ఓ వైపు ఎన్నికలు,   ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతుండటం, ఇంకోవైపు వేసవి సెలవులు కావడంతో చాపకింద నీరులా గంజాయి ముఠా రెచ్చిపోయే అవకాశం ఉంది. అక్రమార్కులను కట్టడి చేసేందుకు.. మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యం చేరేందుకు ఎస్పీ బి.రోహిత్‌రాజు తాజాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గంజాయి తరలించేందుకు అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలు, సాధనాలు, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించేందుకు ఇప్పటికే బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 28 పోలీస్‌ స్టేషన్లలోని అడ్డాల నిర్మూలనే వీటి ప్రధాన లక్ష్యం. ఇప్పటికే జిల్లాలోని హాట్స్పాట్లను గుర్తించి తనిఖీలు విస్తృతం చేసిన పోలీసు బృందాలు, వీలైతే పీడీ యాక్టు అస్త్రం ప్రయోగించనున్నాయి.

రవాణా మార్గాలపై నిఘా కన్ను

హైదరాబాద్‌, మహారాష్ట్ర, బిహార్‌ ప్రాంతాలకు ఏపీ వైపు నుంచి గంజాయి తరలించేందుకు ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం మార్గాలను ముఠాలు ఎంచుకుంటున్నాయి. చాలామంది యువత స్పోర్ట్స్‌ బైక్‌లు, ప్రైవేటు కార్లు, ప్రైవేటు ట్రావెల్స్‌, ఆర్టీసీ బస్సుల్లో సరకును చాకచక్యంగా తరలిస్తున్నారు. పొట్టకూటికి అంటూ నిత్యావసరాల మాటున ఎండు గంజాయి దాటిస్తున్నారు. జిల్లాలోని ప్రాంతాల్లో విద్యార్థులు,  20 ఏళ్ల లోపు యువత గంజాయి బానిసలుగా మారుతుండటంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి   సారించారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.  


ఆ మాటెత్తితే భవిష్యత్తు అంధకారమే

బి.రోహిత్‌రాజు, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం

మా శాఖ తీసుకునే చర్యలతో జిల్లాలో యువత, ఇంకెవరూ గంజాయి మాట ఎత్తాలంటే భయపడాలి.ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరినీ ఉపేక్షించేది లేదు. అక్రమార్జనకు ఆశపడిన కొందరు.. యువత ఆరోగ్యం, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మాఫియాగా మారాలనుకునే నేరగాళ్లకు ముకుతాడు వేస్తాం. మత్తు పదార్థాన్ని సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. మాదక ద్రవ్యాలకు బానిసై కొందరు రోడ్లపై తగాదాలకు పాల్పడుతున్నారు. తొలిసారి కౌన్సెలింగ్‌ ఇస్తాం. అయినా మారకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని