logo

కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!

టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Updated : 30 Apr 2024 06:17 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అయిన పీవీ రంగయ్య నాయుడు 1991లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దుర్మరణంతో పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో ఖమ్మం ఎంపీ పీవీ రంగయ్య నాయుడికి మంత్రి పదవి దక్కింది. 1996లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో రంగయ్య నాయుడు ఓటమి పాలయ్యారు. 1996 ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కర్నూలు జిల్లా నంద్యాల, ఒడిశా రాష్ట్రంలో బెర్హంపూర్‌(బరంపురం) నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధించారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. 1996లోనే నంద్యాల లోక్‌సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఖమ్మంలో ఓడిన మాజీ మంత్రి పీవీ రంగయ్య నాయుడుకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కింది. 1996లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడు ఘోర పరాజయం చవిచూశారు. తెదేపా అభ్యర్థి భూమా నాగిరెడ్డికి 4,41,142 ఓట్లు మెజార్టీ వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి పీవీ రంగయ్య నాయుడు ఒకే ఏడాది రెండు స్థానాల్లో పోటీ చేసిన ఓటమిపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని