logo

రాములోరికి ఘనంగా తిరుమంజనం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు

Published : 02 May 2024 06:23 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు. ‘మా సామివంటే నువ్వేలే రామయ్యతండ్రీ’ అంటూ భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధాన కోవెలలో సుప్రభాతం పలికి ఆరాధించిన అర్చకుల దేవదేవుడి నామాలతో అర్చన నిర్వహించారు. సీతాదేవికి యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. తలంబ్రాల వేడుక తన్మయత్వాన్ని చాటింది. దర్బారు సేవలో కీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడించాయి. గురువారం నూతన పర్యంకోత్సవం నిర్వహించనున్నారు. రామాలయ హుండీ ఆదాయాన్నీ లెక్కించనున్నారు.

వైశాఖ మాసోత్సవాలకు ఏర్పాట్లు

 భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైశాఖ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ రమాదేవి బుధవారం ప్రకటించారు. 8 నుంచి 12 వరకు భగవద్రామానుజాచార్యుల వారి తిరు నక్షత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 13న శ్రీరామ దీక్షల విరమణ ఉంటుంది. అదే రోజున రథోత్సవం, 14న పట్టాభిషేకం చేస్తారు. 19న సర్వ ఏకాదశి సందర్భంగా శ్రీసత్యనారాయణస్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవం ఉంటుంది. 21 నుంచి 26 వరకు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. జూన్‌ 2న లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించనున్నారు.

 బంగారం లెక్కల పరిశీలన: రామాలయంలో స్వామివారికి ఉన్న అన్ని రకాల బంగారం, వెండి ఆభరణాల తూకాలను లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సారైనా స్వర్ణం, రజతం వివరాలను ప్రకటిస్తారని భక్తులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని