logo

దోస్త్‌కు వేళాయె..!

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు.

Published : 05 May 2024 01:53 IST

ప్రవేశాల కోసం ప్రచారం చేస్తున్న అధ్యాపకులు

పాల్వంచ, ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. విద్యార్థులే నేరుగా తమకు ఇష్టమైన కళాశాలలను ఎంచుకునేందుకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) వైబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికి మొదటి దశకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. మొదటి విడతలో సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండో దశ జూన్‌ 4 నుంచి 13 వరకు, మూడో దశ జూన్‌ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందని విద్యార్థులతోపాటు సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు, సార్వత్రిక ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారితో పాటు నీట్‌, ఎంసెట్‌ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశముంటుంది.

అందుబాటులోకి సరికొత్త కోర్సులు

బీఏలో పబ్లిక్‌ పాలసీ/గవర్నెన్స్‌, బీఎస్సీలో లైఫ్‌సైన్స్‌లో బయోమెడికల్‌ సైన్సెస్‌, బీకాంలో ఫైనాన్స్‌ కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీఎస్సీ, బీజడ్సీ కోర్సుల్లో ఈ ఏడాది కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీఏ కోర్సుల్లో కొత్తగా టూరిజం/ట్రావెల్స్‌, రిటైల్‌ ఆపరేషన్‌, బీఎస్సీలో హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉంటాయి. ఆయా కోర్సులకు ఉపకార వేతనం సైతం ప్రభుత్వం అందించి ప్రోత్సహించనుంది. కోర్సు పూర్తవగానే ఉపాధి మార్గం లభించేలా చర్యలు తీసుకోనుంది. అంతర్జాలంలో దరఖాస్తు, వెబ్‌ ఆప్షన్‌, రూ.200 రుసుము చెల్లింపు వంటి అంశాలపై అవగాహన ఉంటే సెల్‌ఫోన్‌లోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే సమీపంలోని మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించాలి. ఆధార్‌ అనుసంధానం కాకుంటే సమీపంలోని మీసేవ కేంద్రంలో సంప్రందించాలి. సెల్‌ఫోన్‌ నంబరుకు ఆధార్‌ అనుసంధానమైతేనే దరఖాస్తు చేయటం సాధ్యమవుతుంది. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌లో దరఖాస్తు చేసుకోవడం సులభం. దరఖాస్తు చేసుకొని ‘దోస్త్‌’ ఐడీ, పిన్‌ పొందాక అది ఎవరికీ ఇవ్వొద్దు. విద్యార్థి సాధ్యమైనంత మేరకు ఎక్కువ వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయాలి. ఆప్షన్లకు ముందుగా ఏ కళాశాలల్లో ఏ కోర్సు ఉంది. రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌, ఇన్‌టెక్‌ ఎంత అనే విషయానికి సైట్‌లోని ‘సెర్చ్‌ బై కాలేజ్‌ కోర్సు’పై క్లిక్‌ చేయాలి.

దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు సొంతం లేదా కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు ఇవ్వాలి. ఓటీపీలు, పిన్‌లను ఇతరులతో పంచుకోవద్దు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ ప్రవేశాల ప్రక్రియ ముగిసే వరకు ఉండాలి. ఇతర వివరాలకు సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాలను సంప్రదించాలి.

డాక్టర్‌ ఎం.సుబ్రహ్మణ్యం, ‘దోస్త్‌’ సమన్వయకర్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని