logo

గెలిచే వరకు.. ఆపకు పరుగు

‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు.

Published : 05 May 2024 02:00 IST

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: ‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అథ్లెటిక్స్‌ రంగంలో సాధన చేసిన వారు పతకాలతోపాటు ఉద్యోగాలు సాధించారు. ఇలా కొలువులు పొందిన వారి సంఖ్య వంద వరకు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, రక్షణ దళాలు, పోలీసు శాఖల్లో చేరారు. ఆరోగ్యంతోపాటు దాదాపు ఏదో ఓ ఉద్యోగం సాధించిన వారిలో అథ్లెట్ల సంఖ్యే ఎక్కువ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ అంశానికున్న ప్రాధాన్యం వివరించేందుకు అంతర్జాతీయ సమాఖ్య ఏటా మే నెలలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ దినోత్సవాన్ని జరుపుతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ‘అథ్లెటిక్స్‌ ఫర్‌ బెటర్‌ వరల్డ్‌’ నినాదాన్ని విస్తృతంగా ప్రచారంలో తెచ్చారు.


2004లో అకాడమి...

2004లో ఖమ్మం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం కేంద్రంగా విలువిద్య, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ అకాడమీలను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కోటి జారిపోగా అథ్లెటిక్స్‌ అకాడమి మాత్రం కొనసాగుతోంది. ఇక్కడ సాధన చేసిన క్రీడాకారులు నజీబ్‌, సుధాకర్‌, పవన్‌కుమార్‌ అంతర్జాతీయ పోటీల వేదికపై నిలిచారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ తర్వాత ఆ స్థాయి ఫలితాలు సాధిస్తున్నది ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీనే.

స్టేడియంలో ఎనిమిది లైన్ల 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


మంచి ఆరోగ్యం

అథ్లెటిక్స్‌ సాధన చేస్తున్న చిన్నారులు

అథ్లెటిక్స్‌ రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ అంశాల సమూహం. ఇందులో ఏదో ఓ అంశాన్ని ఎంచుకొని సాధన చేసిన వారు మంచి ఆరోగ్యం, కీర్తి పతాకాలు, ఉద్యోగాలను అందుకున్నారు. సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న క్రీడాంశం కూడా ఇదే అంటున్నారు. ఇటీవల జిల్లాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగాలు సాధించిన వారిలో అత్యధికులు అథ్లెట్లు ఉన్నారు. తాజాగా కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు వచ్చాయి. 11 మంది ఉద్యోగాలు పొందారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, సీఐఎస్‌ఎఫ్‌, నేవీ, పోస్టల్‌, ఆదాయపన్ను శాఖల్లో జిల్లాకు చెందినవారు ఉద్యోగాలు పొందారు. ముగ్గురు శిక్షకులుగా స్థిరపడ్డారు. 15 మంది పీఈటీలు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో తొంబైశాతం మంది అథ్లెటిక్స్‌నే నమ్ముకొని స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి వరకు రాణించిన క్రీడాకారులు ఉన్నారు.


క్రీడా కోటాలో ఉద్యోగం పొందాలంటే..
సునీల్‌, సీనియర్‌ క్రీడాకారుడు

నేను స్పోర్ట్స్‌ కోటాలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ శాఖలో ఉద్యోగం సాధించా. మా అన్నయ్య సీనియర్‌ అథ్లెట్‌. ఆయన ఇదే కోటాలో రైల్వే ఉద్యోగం సాధించారు. ఉన్నత లక్ష్యంతో సాధన చేయాలి. సీనియర్స్‌, అండర్‌ 20 విభాగానికి వచ్చే వరకు పట్టుదల వీడకుండా ఉండాలి. అక్కడ వచ్చే పతకం, ఫలితమే క్రీడా కోటాలో ఉద్యోగానికి మార్గం సుగమం చేస్తుంది. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ స్థాయిలో జాతీయ పతకాలు సాధించి అండర్‌-20 రాకముందే వదిలేస్తే చేసిన సాధన, శ్రమ వృథా అవుతుంది.


క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మెరవాలి
గౌస్‌, అకాడమి శిక్షకుడు

ఇక్కడి అకాడమి నుంచి క్రీడాకారులను ఒలింపిక్స్‌కు తీర్చిదిద్దాలనే గట్టి సంకల్పంతోనే సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సదుపాయాలు ఉంటే ఆ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దగలమనే నమ్మకం ఉంది. ఇప్పటికే ఆసియా స్థాయి పోటీలకు బాలికలను సిద్ధం చేస్తున్నాం. నేను జిల్లా అథ్లెటిక్స్‌ రంగం నుంచే వచ్చా. తగిన అనుభవం, ప్రణాళిక ఉంది కాబట్టే సదుపాయాలను కోరుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని