logo

ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి: కలెక్టర్‌

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్‌ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు.

Published : 05 May 2024 02:17 IST

ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో పాల్గొన్న కలెక్టర్‌ గౌతమ్‌, ఎన్నికల పరిశీలకుడు సంజయ్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్‌ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండో దశలో ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక కంట్రోల్‌ యూనిట్‌, ఒక వీవీప్యాట్‌, మూడు బ్యాలెట్‌ యూనిట్లు కేటాయించామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డీఆర్వో రాజేశ్వరి, చీకటి రాంబాబు (భారాస), గోపాలరావు (కాంగ్రెస్‌), విద్యాసాగర్‌ (భాజపా), స్వతంత్ర అభ్యర్థులు చిట్టిమల్లు, జోగ్రామ్‌, రవిచందర్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 10,907 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.

ఇంటి నుంచి ఓటేసిన 1,597 మంది

ఖమ్మం లోక్‌సభ స్థానంలో హోం ఓటింగ్‌ పద్ధతిలో రెండు రోజుల్లో 1,597 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.  

ఖమ్మం గ్రామీణం: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. ఖమ్మం గ్రామీణ తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను శనివారం పరిశీలించారు. పోలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ఓటర్ల రిజిస్ట్రేషన్లను తనిఖీ చేశారు. ఓటింగ్‌ సరళి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి మే 8వరకు పోస్టల్‌ ఓటేసే అవకాశముందన్నారు. తహసీల్దారు రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన.. పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ సునీల్‌దత్‌ శనివారం పరిశీలించారు. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతోపాటు పాలేరు, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లకి సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ఇక్కడే చేపట్టనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఏఆర్‌ఓ రాజేశ్వరీ, డీఎస్‌ఓ చందన్‌కుమార్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ శ్రీలత, ఖమ్మం గ్రామీణ ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని