logo

కోడి ధరకు రెక్కలు

వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి.

Published : 06 May 2024 01:41 IST

కిలో మాంసం రూ.280

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం బ్రాయిలర్‌ కోడి మాంసం కిలో రూ.280, స్కిన్‌లెస్‌ రూ.300లకు చేరుకుంది. సాధారణ రోజుల్లోనే చికెన్‌ దుకాణాల వద్ద వరుస కట్టే మాంసాహారప్రియులు ధరల పెరుగుదల కారణంగా వారాంతంలోనూ వాటి వద్ద పెద్దగా కనిపించడం లేదు. కొనలేమని వినియోగదారులు, అమ్మకాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు.

వేసవి దెబ్బ..

వేసవిలో పెంపకం చేపట్టకపోవడం, అధిక వేడి కారణంగా కోడి బరువు పెరుగుదలలో వ్యత్యాసం ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణాలని వ్యాపారులంటున్నారు. మొక్కులు చెల్లించేవారు, ఇతర శుభ, అశుభ కార్యాల సందర్భంగా మటన్‌తోపాటు కోడి మాంసం పెడుతుంటారు. సరఫరా తగ్గడంతో బతికున్న కిలో బ్రాయిలర్‌ కోడిని ఆదివారం రూ.230లకు విక్రయించారు. గుడ్లు పెట్టే కోడి రూ.220లకు విక్రయించారు.

నిలిచిన సరఫరా.. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు స్థానికంగా పెంచిన కోళ్లకు తోడు సిద్ధిపేట, ఏపీలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి సరఫరా అవుతున్నాయి. వేసవి కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బ్రాయిలర్‌ కోడి ధర పెరుగుదల ప్రభావం నాటుకోడిపైనా కనిపిస్తోంది. గత వారం వరకు కిలో రూ.450 ఉన్న నాటుకోడి ధర ఈ వారం రూ.500లకు చేరుకుంది.

నిత్యం 40 టన్నుల వినియోగం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోడి మాంసం వినియోగం భారీగా ఉంటోంది. సాధారణ రోజుల్లో రోజుకు 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్‌లో 50 టన్నుల వరకు ఉంటోంది. ఆదివారం 120 టన్నుల విక్రయం జరుగుతోంది. సింహభాగం ఖమ్మం నగరంలోనే ఉంటుంది. జూన్‌లో పౌల్ట్రీ వ్యాపారులు కొత్త కోళ్ల పెంపకం చేపడతారు. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా జరగకుంటే ఈ ప్రభావం జూలై చివరి వారం వరకు ఉండే అవకాశం ఉంటుంది.

ఖమ్మం చికెన్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పారా సత్యనారాయణ మాట్లాడుతూ... శుభకార్యాలు లేకుంటే వ్యక్తిగత కొనుగోళ్లు అధికంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం వేసవి కారణంగా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో కోడి ధర అసాధారణంగా పెరిగినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని